Maharashtra Covid Update: కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ విరుచుకుపడే అవకాశముందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని మత, సామాజిక,రాజకీయ సభలు, సమావేశాలు, వేడుకలను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆదేశాలు జారీ చేశారు. మొదటి, రెండో విడత కరోనా కేసుల దృష్ట్యా, జనసమీకరణలతో రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని సీఎం థాకరే పేర్కొన్నారు.
ప్రజల ఆరోగ్యం కాపాడటమే ప్రథమ కర్తవ్యమని, వేడుకలు తరవాతనైనా జరుపుకోవచ్చని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. ”మనం పండుగలు తరువాత చేసుకుందా. ప్రజలు ప్రాణాలు, ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యం ఇద్దాం. రోజువారీ కేసులు పెరుగుతుండటంతో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంది” అని ఉద్దవ్ హెచ్చరించారు.
సోమవారంనాడు జరిగిన ‘డిజాస్టర్ మేనేజిమెంట్’ సమావేశంలో సీనియర్ మంత్రులతో కలసి సీఎం ఉద్ధవ్ థాకరే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా థాకరే మాట్లాడుతూ, పండుగలు, మతపరమైన కార్యక్రమాలపై ఆంక్షలు విధించడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు? అయితే ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యం” అని అన్నారు. దీనికి ముందు వర్చువల్‌గా జరిగిన మహా డాక్టర్ కాన్ఫరెన్స్ ప్రారంభోపన్యాసంలో సీఎం థాకరే ప్రసంగించారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఎం కోరారు. ముఖ్యంగా ఆలయాలు, సంస్థలు, ప్రదేశాలు తెరవాలని ప్రజలు నిరసన తెలపవద్దని కోరారు.
I request people not to protest for reopening of temples and other places. If you want to protest, protest against Corona: Maharashtra Chief Minister Uddhav Thackeray https://t.co/ArMk8JOhx8
— ANI (@ANI) September 5, 2021
అయితే, కొందరు తమ వ్యాపార సంస్థలు తెరవాలని తొందరపడుతున్నారని, వారిని వేచిచూడాలని తాము కోరుతున్నామన్నారు. ఒకవేళ తెరిచినా పరిస్థితి విషమిస్తే తిరిగి మూసివేయక తప్పదన్నారు సీఎం. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని థాకరే హెచ్చరించారు. కాగా, థర్డ్ వేవ్ కనుక వస్తే 60 లక్షల కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపె అభిప్రాయపడ్డారు. మొదటి వేవ్‌లో 20 లక్షల కేసులు, రెండో వేవ్‌లో 40 లక్షల కేసులు చూశామని, థర్డ్ వేవ్ వచ్చిన పక్షంలో సునామీ తరహాలో 60 లక్షలకు కేసులు చేరే అవకాశాలున్నాయని అన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరింత అప్రమత్తత అవసరమని సూచించారు. ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా అన్ని పూర్తి చేస్తున్నామన్నారు.
గత సంవత్సరంలాంటి పరిస్థితులను నివారించడానికి పండుగలలో కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని ముఖ్యమంత్రి ఆదివారం విజ్ఞప్తి చేశారు. “గత సంవత్సరం పండుగల తర్వాత COVID-19 కేసులు గణనీయంగా పెరుగాయి. పండుగలు, సమావేశాల పేరుతో రద్దీని నివారించాలన్నారు. కరోనా టీకా తీసుకున్న తర్వాత కూడా ఫేస్ మాస్క్ తప్పని సరిగా ధరించడం ముఖ్యమన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి కేసులు కూడా పెరుగుతున్నాయి. కానీ వాటి లక్షణాలు ఈసారి భిన్నంగా ఉంటాయి. అందువల్ల, అలాంటి రోగులు తప్పనిసరిగా కోవిడ్ -19 పరీక్ష చేయించుకోవాలి ”అని ముఖ్యమంత్రి థాకరే అన్నారు.
ఇదిలావుంటే, మహారాష్ట్రలో ఇప్పటివరకు నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 64,86,174 గా ఉండగా, మరణాల సంఖ్య 1,37,774గా నమోదైంది. మరోవైపు, ఇప్పటివరకు 62,94,767 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక మొత్తం కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 5,48,54,018 కాగా, ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 50,095గా ఉంది.