
మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతోంది మహారాష్ట్ర ప్రభుత్వం. “లవ్ జిహాద్” కు వ్యతిరేకంగా చట్టం చేయబోతోంది. మహారాష్ట్ర రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) నేతృత్వంలో లవ్ జిహాద్ పై రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ లవ్ జిహాద్‌కు సంబంధించిన అన్ని చట్టపరమైన, సాంకేతిక అంశాలను చర్చించి ఒక నివేదికను రూపొందించి, ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది.
మహారాష్ట్రలో పెరుగుతున్న లవ్ జిహాద్ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. లవ్ జిహాద్, మోసపూరిత, బలవంతపు మతమార్పిడులను ఆపడానికి ఒక చట్టం తీసుకురాబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అధ్యక్షతన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేసి, లవ్ జిహాద్, మోసం మరియు బలవంతపు మతమార్పిడిపై చర్యలను సూచించే చట్టాన్ని రూపొందిస్తుంది. ఈ విధంగా, లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టం చేసిన దేశంలో పదవ రాష్ట్రంగా మహారాష్ట్ర అవతరిస్తుంది.
ఇప్పటివరకు, దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాలు తీసుకువచ్చాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు లవ్ జిహాద్ నిరోధక చట్టాలను అమలు చేశాయి. అదే విధంగా, బీజేపీ నాయకుడు, మంత్రి నితేష్ రాణేతో సహా రాష్ట్రంలోని వివిధ హిందూ సంస్థలు మహారాష్ట్రలో లవ్ జిహాద్ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మత మార్పిడిపై ఫిర్యాదులు వచ్చిన తర్వాత, దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో దీనికి వ్యతిరేకంగా చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అధ్యక్షతన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, మైనారిటీ అభివృద్ధి శాఖ కార్యదర్శి, చట్టం మరియు న్యాయ శాఖ కార్యదర్శి, సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయ శాఖ కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, హోం శాఖ (చట్టం) కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేస్తుంది. లవ్ జిహాద్, మోసపూరిత, బలవంతపు మత మార్పిడులకు పరిష్కారాలను సూచిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అధ్యయనం చేస్తుంది. ఈ కమిటీ చట్టాన్ని రూపొందించడంతోపాటు చట్టపరమైన అంశాలను కూడా అధ్యయనం చేస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..