Covid-19 Effect: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇక కరోనా కట్టడిలో తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబాలకు సైతం దూరంగా ఉంటూ విధుల్లో ఉంటూ కరోనా బారిన పడుతున్నారు. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాదిలో 42 మంది పోలీసులు కరోనా బారిన పడి మృతి చెందినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈనెల రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగాయి. అయితే మృతి చెందిన 42 మందిలో సుమారు 30 మంది సింగిల్‌డోస్, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారున్నారు. ఇక మరి కొందరు 40-49 ఏళ్ల మధ్య వారున్నారు. మృతుల్లో 38 ఏళ్ల వయసున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ కూడా ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పోలీసు శాఖలో కోవిడ్ మరణాలు భారీగా పెరిగాయి.
2020 మార్చి, డిసెంబర్ మధ్య 35 మంది పోలీసులు కరోనా బారిన పడి ప్రాణాలు వదిలారు. ఈ ఏడాదిలో 44 మంది మరణించారు. ఇప్పటి వరకు పోలీసు శాఖలో వ్యాక్సినేషన్‌లో భాగంగా 90 శాతం మందికి టీకాలు వేసినా.. మరణాలు నమోదయ్యాయి. దీనిపై మధ్యప్రదేశ్ డీజీపీ వివేక్ మాట్లాడుతూ.. మృతుల్లో చాలా మంది సిబ్బంది కోవిడ్ మొదటి, రెండో డోస్ టీకా తీసుకున్నవారు ఉన్నారని పేర్కొన్నారు. అయితే ఇలా రకరకాల అనారోగ్య సమస్యలు ఉన్న కారణంగా కూడా వారి మృతికి కారణంగా చెప్పవచ్చని అన్నారు. విధి నిర్వహణలో ఉంటున్న పోలీసుల అరోగ్య విషయంలో పోలీసు శాఖ నుంచి అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు.