
మధ్యప్రదేశ్ లోని అధ్మాత్మిక నగరం ఉజ్జయినిలో భారీ హింస చెలరేగింది. గురువారం (జనవరి 23) రాత్రి వీహెచ్‌పీ నేతపై గుర్తుతెలియని వ్యక్తుల దాడితో చెలరేగిన అల్లర్లు రెండో రోజు కూడా కొనసాగాయి. అల్లరి మూకలు పలు బస్సులకు నిప్పుపెట్టాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటన తరువాత పోలీసులు ఉజ్జయినిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అల్లర్లతో సంబంధం ఉన్న 12 మందిని అరెస్ట్ చేశారు.
ఉజ్జయిని బస్టాండ్‌లో దూరిన అల్లరమూకలు విధ్వంసం సృష్టించాయి. 15 బస్సులను తగలబెట్టారు. ఉజ్జయిని లోని తరానా ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. డ్రోన్లతో నిఘా పెట్టారు. అల్లర్లపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు మహిళలు దాడులను ఎదుర్కోవడానికి కర్రలతో బయటకు వచ్చారు. అయితే ప్రజలు సంయమనం పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. పుకార్లను నమ్మవద్దని కోరారు. అల్లరిమూకలను ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఉజ్జయిని ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపారు. పెట్రోలింగ్ చేస్తున్నామని, సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మోహరించామన్నారు. పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఆయన, ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. 15 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశామని, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితులను గుర్తించి, అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ ప్రదీప్ శర్మ అన్నారు. బస్సులతో పాటు కార్లను, టూవీలర్స్‌ను కూడా అల్లరిమూకలు ధ్వంసం చేశాయి. కాగా, బస్సు డ్రైవర్‌తో చిన్న గొడవ ఈ అల్లర్లకు దారితీసినట్టు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడయ్యింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..