Chennai Rains: ఇప్పటికే కురిసిన వర్షాలతో తమిళనాడు మొత్తం చిగురుటాకులా వణుకుతోంది. ఇంతలోనే మరో పిడుగు లాంటి వార్తను వాతావరణ మోసుకొచ్చింది. మరోసారి అతిభారీ వర్షాలు చుట్టుముట్టబోతున్నట్టు హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దీంతో చెన్నై నగరాసులను భయంతో కూడిన మేఘాలు కమ్మేశాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా.. అల్పపీడనం ఏర్పడింది. రేపు ఉదయానికల్లా ఇది తమిళనాడు వైపు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ముఖ్యంగా చెన్నై నగంరలో 20 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా.. చెన్నై నగరం అస్తవ్యస్తమైంది. చెన్నై సహా 28 జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. అత్యధికంగా నాగపట్నంలో 30, కార్తెక్కల్‌లో 29 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. మేటూరు, భవాని సాగర్ డ్యామ్.. ప్రమాదకరంగా మారాయి. చెక్ డ్యామ్‌లు.. ఎక్కడికక్కడ దెబ్బతిన్నాయి.
తమిళనాడు తీర ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కావేరి పరీవాహక జిల్లాల్లో వేలాది ఎకరాల్లో భూములు నీట మునిగాయి. ఈ వర్షాల ప్రభావంతో తమిళనాడులోని కనీసం 20 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
ఇటు నెల్లూరుతో పాటు గ్రేటర్ రాయలసీమకు ఇదే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో రెండు రోజుల పాటు పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది.
రాయలసీమ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సోమశిల జలాశయానికి భారీగా వరద వస్తోంది. మరోవైపు పెన్నా ఉపనదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమళిలకు ప్రస్తుతానికి 19వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 19,500 క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు అధికారులు. జలాశయంలో ప్రస్తుతం 71. 296 క్యూసెక్కుల నీరు ఉంది.
సుళ్లూరుపేటలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. డ్రైన్లు పొంగి పొర్లడంతో రోడ్లు చెరువులను తలపిస్తు్న్నాయి.
ఇవి కూడా చదవండి: Chanakya Niti: శత్రువును ద్వేషించకు స్నేహితుడిలా చూడు.. చాణక్యుడు చెప్పిన సక్సెస్ సీక్రెట్ ఇదే..