పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి ఆగస్ట్ 13 వరకు ఈ సెషన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం ఆల్‌పార్టీ మీటింగ్ జరగనుంది. కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని విపక్షాలను కోరనున్నారు ప్రధాని మోడీ. మరోవైపు అఖిలపక్ష నేతలతో సమావేశమవనున్నారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని సభ్యులను కోరనున్నారు. మొత్తం 19 రోజులు సమావేశాలు జరగనున్నాయి.
ఇక ఇవాళ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశమవనున్నారు అధినేత్రి సోనియాగాంధీ. వర్చువల్‌గా నిర్వహించే ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు పాల్గొననున్నారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఈ సమావేశాల్లో 15 బిల్లులను కేంద్రం..పార్లమెంటు ముందుకు తీసుకురానుంది.
కరోనా థర్డ్‌వేవ్ భయాల నేపథ్యంలో జరగనున్న ఈ సమావేశాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. కేంద్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ తరువాత వచ్చిన తొలి సమావేశాలు ఇదే కావడం విశేషం. అలా పలువురు కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించాక సభలో ప్రతిపక్షాలను తొలిసారి ఎదుర్కోవాల్సి వస్తోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన ప్రాంతీయ పార్టీల చేతిలో బీజేపీ ఓటమి పాలయ్యాక జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాలూ ఇవే. అలా ఈ ఏడాది జరగనున్న వర్షాకాల సమావేశాలకు ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వం తన అజెండాను ముందుకు తీసుకురావాలనీ, ప్రతిపక్షాలు తమ వాణిని వినిపించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనీ ప్రయత్నించే వేళ… మొత్తం 19 రోజులు పార్లమెంట్ సమావేశం కానుంది.