INDIA Alliance: ఆ రాష్ట్రంలో సీట్ల పంపకంపై సూత్రప్రాయ అంగీకారం..! 20-20-8 ఫార్ములా సక్సెస్ అయ్యేనా..?

| Edited By: Shaik Madar Saheb

Jan 11, 2024 | 6:46 AM

లోక్‌సభ ఎన్నికల కోసం కసరత్తు ముమ్మరం చేసిన విపక్ష కూటమి (I.N.D.I.A) రాష్ట్రాలవారిగా సీట్ల పంపకం, సర్దుబాటుపై మంతనాలు సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), కాంగ్రెస్ పార్టీల మధ్య ఢిల్లీలోని 7 సీట్లలో పోటీపై అవగాహన కుదిరింది. యూపీలో సీట్ల పంపకం బాధ్యతల్ని ఆ రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న సమాజ్‌వాదీ పార్టీకి చేపట్టినప్పటికీ.. వీలైనన్ని ఎక్కువ సీట్లు పొందాలన్న ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది.

INDIA Alliance: ఆ రాష్ట్రంలో సీట్ల పంపకంపై సూత్రప్రాయ అంగీకారం..! 20-20-8 ఫార్ములా సక్సెస్ అయ్యేనా..?
India Alliance
Follow us on

లోక్‌సభ ఎన్నికల కోసం కసరత్తు ముమ్మరం చేసిన విపక్ష కూటమి (I.N.D.I.A) రాష్ట్రాలవారిగా సీట్ల పంపకం, సర్దుబాటుపై మంతనాలు సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), కాంగ్రెస్ పార్టీల మధ్య ఢిల్లీలోని 7 సీట్లలో పోటీపై అవగాహన కుదిరింది. యూపీలో సీట్ల పంపకం బాధ్యతల్ని ఆ రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న సమాజ్‌వాదీ పార్టీకి చేపట్టినప్పటికీ.. వీలైనన్ని ఎక్కువ సీట్లు పొందాలన్న ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. యూపీ తర్వాత లోక్‌సభ సీట్ల ప్రకారం రెండో పెద్ద రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీలో భాగంగా ఉన్న కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) శరద్ పవార్ వర్గం నేతల మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయి. రాష్ట్రంలోని మొత్తం 48 సీట్లలో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయంపై మూడు పార్టీల నేతలు అవగాహనకు వచ్చినట్టు తెలిసింది. అయితే ఏయే స్థానాలు ఎవరు పంచుకోవాలన్న అంశంపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో పాటు కూటమి నేతలు సంజయ్ రౌత్, నానా పటోలే, బాలాసాహెబ్ థోరాట్, అశోక్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.

విపక్ష కూటమి ఈ రాష్ట్రంలో తమ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తోంది. 2019లో బీజేపీ – శివసేన కలిసి పోటీ చేయగా.. 25 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ 23 చోట్ల గెలుపొందింది. 23 సథానాల్లో పోటీ చేసిన శివసేన 18 స్థానాల్లో గెలుపొందింది. ఇదే తరహాలో కాంగ్రెస్ – ఎన్సీపీ కలిసి పోటీ చేశాయి. 25 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ చంద్రాపూర్ నియోజకవర్గం ఒక్కటే గెలుచుకోగలిగింది. ఎన్సీపీ 19 స్థానాల్లో పోటీ చేసి 4 గెలుచుకుంది. అయితే ఈ నాలుగున్నరేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు సమూలంగా మారిపోయాయి. రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న శివసేన, ఎన్సీపీలు రెండుగా చీలిపోయాయి. ఆయా పార్టీల వ్యవస్థాపక కుటుంబాలు కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణం సాగిస్తుండగా.. చీలిక వర్గాలు మాత్రం బీజేపీతో కలిసి నడుస్తున్నాయి. ఎన్నికైన ఎమ్మెల్యే సంఖ్యాబలం చీలికవర్గానికే ఎక్కువగా ఉన్నప్పటికీ, పార్టీలో నేతలు, కార్యకర్తలు తమవైపే ఎక్కువ మంది ఉన్నారని వ్యవస్థాపక కుటుంబాల నేతలు భావిస్తున్నారు. ఈ స్థితిలో ఈ రాష్ట్రంలో పొత్తులు, సీట్ల సర్దుబాటు, సమన్వయం సరిగా చేసుకుంటే 48 స్థానాల్లో మెజారిటీ స్థానాలు కూటమి గెలుపొందవచ్చని అంచనా వేస్తున్నారు.

ఎన్నికల తేదీలు ప్రకటించేలోగా సీట్ల పంపకం, సర్దుబాటు కసరత్తు ముగించి, వీలుంటే అభ్యర్థులను సైతం ప్రకటించాలని కూటమి నేతలు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, శివసేన పార్టీలు చెరో 20 సీట్లలో పోటీ చేయాలని, మిగతా 8 సీట్లలో ఎన్సీపీ పోటీ చేయాలని ప్రతిపాదనలు తెరపైకి రాగా, దీనికి మూడు పార్టీలు దాదాపు సమ్మతి తెలిపాయని తెలిసింది. అయితే ఏయే స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలన్న విషయంలో 40-42 సీట్ల మధ్య దాదాపు అవగాహన కుదిరినప్పటికీ.. మిగతా సీట్ల విషయంలో మాత్రం అభిప్రాయబేధాలు తలెత్తినట్టు సమాచారం. 6-7 సీట్ల విషయంలో మూడు పార్టీలు తమకు పట్టున్న నియోజకవర్గాలుగా పేర్కొంటూ తమకే కేటాయించాలంటూ పట్టుబట్టినట్టు తెలిసింది. ఇలా మొత్తంగా శివసేన – కాంగ్రెస్ – ఎన్సీపీ లు 20-20-8 ఫార్ములా ప్రకారం పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

నిజానికి శివసేన తనకు 23 సీట్లు కావాలని పట్టుబట్టినప్పటికీ 20 సీట్లకు ఒప్పుకునే అవకాశం ఉంది. అసలైన శివసేన ఏక్‌నాథ్ షిండే వర్గానిదే అంటూ అసెంబ్లీ స్పీకర్ తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎన్నికల గుర్తు విషయంలోనూ ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ పరిస్థితుల్లో బేరసారాలు సాగించే అవకాశాలు కూడా కొంతమేర సన్నగిల్లుతాయి.

పవార్ ఫార్ములా!

మూడు పార్టీల మధ్య సీట్ల పంపకం ఎలా జరగాలి అన్న ప్రశ్న తలెత్తినప్పుడు శరద్ పవార్ ఒక ఫార్ములా ప్రతిపాదించారు. దాని ప్రకారం మూడు పార్టీలకు సిట్టింగ్ ఎంపీలున్న స్థానాలతో పాటు 2వ స్థానంలో నిలిచిన సీట్లలో పోటీ చేయాలన్నది పవార్ ఫార్ములా. దీని ప్రకారం చూస్తే శివసేన 18 సీట్లలో గెలుపొందగా, మరో 5 చోట్ల 2వ స్థానంలో నిలిచింది. అందుకే రెండూ కలిపి 23 సీట్లు డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ విషయానికొస్తే ఒక్క సీటే గెలిచినప్పటికీ 21 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఆ లెక్కన ఆ పార్టీకి 22 సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. మొత్తం 45 సీట్లలో శివసేన, కాంగ్రెస్ పార్టీలకే 45 సీట్లు కేటాయించాల్సి వస్తోంది. ఎన్సీపీ కేవలం 3 సీట్లకే పరిమితం కావాల్సి వస్తుంది. కానీ ఎన్సీపీ గత ఎన్నికల్లో 4 సీట్లలో గెలవగా, 15 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. అంటే పవార్ ఫార్ములా ప్రకారం 19 సీట్లు కేటాయించాలి. ఈ లెక్కన మొత్తం 48 సీట్లను మూడు పార్టీలు పంచుకోవడం సాధ్యం కాదు.

అందుకే పవార్ ఫార్ములా ఆచరణ సాధ్యం కాదని, ఆమోదయోగ్యం కూడా కాదని నేతలు భావించారు. బీజేపీని ఓడించాలన్న తమ ఉమ్మడి లక్ష్యాన్ని గుర్తుచేసుకుంటూ సీట్ల విషయంలో పట్టువిడుపు ధోరణి ప్రదర్శించాలని నిర్ణయించారు. పైగా 2019లో ఉన్న స్థితిలో శివసేన, ఎన్సీపీలు లేవు. రెండు పార్టీలు చీలిక తర్వాత బలహీనపడ్డాయి. ఇలాంటప్పుడు ఎక్కువ సీట్ల కోసం పేచీ పెడితే అంతిమంగా లాభపడేది ప్రత్యర్థి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమేనని నేతలు వాస్తవ స్థితిని గ్రహించారు. శివసేన తాను గెలుచుకున్న 18 సీట్లకే పరిమితమై మిగతా సీట్లను కాంగ్రెస్, ఎన్సీపీ, వంచిత్ బహుజన్ అగాఢీ (VBA) పార్టీలకు వదిలేయాలన్న సూచన నేతల నుంచి వ్యక్తమైంది. అదే సమయంలో కాంగ్రెస్ – ఎన్సీపీలు కూడా 2019లో కలిసి పోటీ చేసినా 5 స్థానాలకు మించి గెలవలేకపోయాయి కాబట్టి వాస్తవ స్థితిగతులు, క్షేత్రస్థాయి బలాబలాలను బేరీజు వేసుకుంటూ 20-20-8 ఫార్ములా ప్రకారం ముందుకెళ్లడమే ఉత్తమమని నేతలు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన మాత్రం విడుదల కాలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..