కోవిడ్ వ్యాప్తి చెందకుండా నివారించాలంటే ఢిల్లీలోను, ఇతర జిల్లాల్లోనూ మరో 6 నుంచి 8 వారాల లాక్ డౌన్ విధించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హెడ్ డాక్టర్ బలరాం భార్గవ అన్నారు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు 10 శాతం కన్నా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కఠిన లాక్ డౌన్ విధించడం ఒక్కటే పరిష్కారమార్గమని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశంలో 718 జిల్లాల్లో 10 శాతం కన్నా ఎక్కువ కోవిద్ కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీతో బాటు ముంబై, బెంగుళూరు నగరాలను కూడా ఆయన ప్రస్తావించారు. దేశంలో ఎన్నిచోట్ల కఠిన ఆంక్షలు ఉండాలన్న దానిపై బలరాం భార్గవ వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి.హైపాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాలు విధిగా లాక్ డౌన్ లో ఉండాల్సిందేనని, ఇవి 10 శాతం పాజిటివిటీ నుంచి 5 శాతం పాజిటివిటీని సాధించినా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒకప్పుడు 35 శాతం పాజిటివిటీ ఉండి ఇప్పుడు 17 శాతానికి తగ్గిన ఢిల్లీ గురించి ఆయన ప్రస్తావిస్తూ..రేపు ఢిల్లీలో గనుక లాక్ డౌన్ ఎత్తివేస్తే డిజాస్టరే అవుతుందని హెచ్చరించారు.
ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని బలరాం భార్గవ విమర్శించనప్పటికీ.. కోవిడ్ క్రైసిస్ కి రెస్పాండ్ కావడంలో ఆలస్యం జరుగుతోందన్నారు. గత ఏప్రిల్ 15 వ తేదీనే కోవిద్ పై గల నేషనల్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో ..10 శాతం , అంతకన్నా ఎక్కువ పాజిటివిటీ ఉన్న నగరాలూ, జిల్లాల్లో లాక్ డౌన్ విధించాలని సిఫారసు చేసినట్టు ఆయన గుర్తు చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Farmer Success Story: వరి సాగులో ప్రయోగాల ఘణుడు.. శాస్త్రవేత్తగా మారిన సామాన్య రైతు