కొత్త ఆర్థిక సంవత్సరం శనివారం (ఏప్రిల్ 1) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2023-24 సంవత్సరానికి మద్యం వ్యాపారం నుంచి దాదాపు రూ.45 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సేకరించే లక్ష్యంతో ఉత్తర ప్రదేశ్ కొత్త ఎక్సైజ్ పాలసీని అమలులోకి తెచ్చింది. మద్యం వ్యాపారుల లైసెన్స్ ఫీజును పది శాతం మేర అమాంతం పెంచేసింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి ఆ రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగిపోయాయి. కాగా కొత్త మద్యం పాలసీ బిల్లును ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో రాష్ట్ర క్యాబినెట్ జనవరిలో ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. శనివారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త లిక్కర్ పాలసీతో విదేశీ మద్యంతోపాటు, బీరు, భాంగ్, మోడల్ షాపుల లైసెన్స్ ఫీజును 10 శాతం పెంచింది. తాజా ప్రభుత్వ నిర్ణయంతో దేశీ మద్యం రూ.5, విదేశీ మద్యం రూ.10, బీరు రూ.5 నుంచి రూ.7 వరకు పెరగనున్నాయి.
నోయిడా, ఘజియాబాద్, లక్నో మునిసిపల్ కార్పొరేషన్ జిల్లాలకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు, బార్‌లను ప్రత్యేక కేటగిరీగా పరిగణించి లైసెన్స్ ఫీజులను పెంచారు. 25 శాతం ఇంటెన్సిటీ ఉన్న 200 మిల్లీలీటర్ల కంట్రీ లిక్కర్ ప్యాకెట్ ధర రూ.50 నుంచి రూ.55కి పెరగనుంది. 36 శాతం ఇంటెన్సిటీ ఉన్న 200 ఎంఎల్ ప్యాకెట్ల ధర రూ.65 నుంచి రూ.70కి, 42.8 శాతం ఇంటెన్సిటీ ఉన్న 200 ఎంఎల్ ప్యాకెట్ల ధర రూ.75 నుంచి రూ.80కి పెరగనుంది. లిక్కర్ షాపులను తెరిచే, మూసివేసే వేళలను మాత్రం యథాతథంగా ఉంచారు. కానీ ప్రత్యేక సందర్భాల్లో ప్రభుత్వ ముందస్తు అనుమతితో విక్రయించవల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.