మాయదారి పిడుగు పడితే అంతా మటాష్.. మరి ప్రాణాలు రక్షించుకోవడం ఎలా..?

| Edited By: Ravi Panangapalli

Jul 17, 2024 | 9:55 AM

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) నివేదిక మేరకు 2022లో ప్రకృతి విపత్తుల కారణంగా దేశంలో 8,060 మరణాలు సంభవించగా.. అందులో 2,887 మరణాలకు మాయదారి పిడుగు పాటే కారణం. అంటే ప్రకృతి విపత్తుల మరణాల్లో 35.8 శాతం మరణాలకు పిడుగులే కారణమవుతున్నాయి.

మాయదారి పిడుగు పడితే అంతా మటాష్.. మరి ప్రాణాలు రక్షించుకోవడం ఎలా..?
Lightning Strikes
Follow us on

ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు.. నిత్యం మనిషిని వెంటాడుతున్నాయి. సహజంగా మనం వరదలు, భూకంపాలు, వడగాలులను ప్రకృతి విపత్తులుగా పరిగణిస్తుంటాం. పిడుగును పెద్ద ప్రకృతి విపత్తుగా ఎవరూ భావించరు. అయితే అన్నింటికంటే పిడుగే అత్యంత ప్రమాదకారిగా ఎన్నోసార్లు నిరూపితం అయింది. దేశంలో ప్రకృతి వైపరీత్యాలతో సంభవించే మరణాల్లో అత్యధిక మరణాలకు కారణం పిడుగులే. ఐఎండీ గణాంకాల మేరకు మాయదారి పిడుగుల కారణంగా ఏటా దేశంలో 2,500కు పైగా మరణాలు సంభవిస్తున్నాయి.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) నివేదిక మేరకు 2022లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో 8,060 మరణాలు సంభవించగా.. అందులో 2,887 మరణాలకు పిడుగు పాటే కారణం. అంటే ప్రకృతి వైపరీత్య మరణాల్లో 35.8 శాతం మరణాలకు పిడుగులే కారణమవుతున్నాయి. భారీ వర్షాలు, కొండ చెరియలు విరిగిపడిన ఘటనల్లో 358 మంది మృతి చెందగా.. దీనికి చాలా రెట్లు ఎక్కువగా పిడుగుల వర్షానికి మృత్యువాతపడ్డారు. ఆ ఏడాది అత్యధికంగా మధ్యప్రదేశ్ (496), బీహార్ (329), మహారాష్ట్ర (239)లో సంభవించాయి.

Lightning Strikes

NCRB నివేదిక మేరకు ప్రకృతి విపత్తులతో తమిళనాడులో 93 మరణాలు సంభవించగా.. అందులో పిడుగుపాటు మరణాలు 89. అలాగే ఛత్తీస్‌గఢ్‌లో 248 మరణాల్లో 210 మరణాలకు పిడుగులు కారణం. పశ్చిమ బెంగాల్‌లో 195 మరణాల్లో 161 పిడిగుల కారణంగా సంభవించినవే. కర్ణాటకలో 140 మంది ప్రకృతి విపత్తుల కారణంగా మరణించగా.. వీరిలో 96 మంది పిడుగుపాటుతో కన్నుమూశారు. 2019 నుంచి దేశంలో పిడుగుపాటు మరణాలు 20 నుంచి 35 శాతం మేర పెరిగినట్లు ఐఎండీ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే వీటిని ప్రకృతి విపత్తు మరణాలుగా కాకుండా ప్రమాదవశాత్తు సంభవించిన మరణాలుగానే కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తోంది.

కాగా పిడుగుల కారణంగా దేశ వ్యాప్తంగా 2020లో 2,862 మంది, 2021లో 2,880 మంది మరణించారు. పిడుగుల మరణాల్లో 95-96 శాతం గ్రామాల్లోనే సంభవిస్తున్నాయి. అమెరికా వంటి దేశాలతో పోల్చితే మన దేశంలో పిడుగుల కారణంగా సంభవిస్తున్న మరణాలు చాలా ఎక్కువ. అమెరికాలో ప్రతి ఏటా పిడుగుల కారణంగా సరాసరి 20 మరణాలు సంభవిస్తున్నాయి. 2006 నుంచి 2021 వరకు ఆ దేశంలో 444 మంది పిడుగులతో మరణించారు.

మన దేశంలో 1967 నుంచి 2019 వరకు ఏకంగా 1,00,000 మంది పిడుగుపాటుకు గురై మరణించారు. ఇది 52 ఏళ్లలో ప్రకృతి వైపరీత్యాలతో సంభవించిన మరణాల్లో దాదాపు 33 శాతం. అలాగే వరదల కారణంగా సంభవించిన మరణాలకంటే రెండింతలు ఎక్కువ.

Lightning Strikes

ఐఎండీ గణాంకాల మేరకు దేశ ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికంగా పిడుగులు పడుతున్నాయి. అయితే పిడుగుల కారణంగా సంభవించే మరణాలు మాత్రం సెంట్రల్ ఇండియాలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనికి గల కారణాలను కూడా ఐఎండీకి చెందిన వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఈశాన్య భారతావనిలో ఎక్కువగా వేకువజామున పిడుగులు పడుతుండగా.. సెంట్రల్ ఇండియాలో మధ్యాహ్న వేళల్లో పిడుగులు పడుతున్నట్లు నిర్థారించారు. మధ్యాహ్న వేళల్లో ఎక్కువ మంది వ్యవసాయ క్షేత్రాల్లో పనిలో నిమగ్నం కావడంతో ఆ సమయంలో పిడుగుపాటుతో ఎక్కువ మంది మరణిస్తున్నారు. వర్షం కురిసే సమయంలో వ్యవసాయ క్షేత్రాల్లో చెట్లు, చిన్న కట్టడాల కింద తలదాచుకునే వారు ఎక్కువగా పిడుగుపాటుకు గురవుతున్నారు.

యూపీ, బీహార్‌లో పిడుగుల వర్షం..

చినుకులు కురిసే వేళ.. మెరుపులు మెరిసే వేళ.. ఆకాశం అత్యంత అహ్లాదకరంగా ఉన్న సమయంలో ఊహించని విధంగా దాడి చేసేదే పిడుగు. వర్షాలు పడుతున్నప్పుడు రెప్పపాటులో వచ్చే మెరుపు పచ్చని చెట్టును సైతం బూడిద చేస్తుంది. మనిషిని సజీవదహనం చేస్తుంది. నిలువునా కాల్చేస్తుంది. పిడుగు పడిందంటే రెప్పపాటులోనే ప్రాణాలు పోతాయి. అది తాకితే వేల ఓల్టుల విద్యుత్‌ ఒంట్లోకి చేరి క్షణాల్లో మనిషిని బూడిద చేస్తుంది. ఇటీవల కాలంలో పిడుగు పాటుకు గురై బలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

జులై రెండో వారంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పిడుగులతో దద్దరిల్లిపోయింది. 24 గంటల వ్యవధిలోనే పిడుగు పాటుకు 38 మంది దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్నప్పుడు, నీటి కుంటల్లో చేపలు పడుతున్నప్పుడు పిడుగు పాటుకు గురైనవారే ఉన్నారు. అలాగే వర్షం పడుతుండగా చెట్టుకింద తలదాచుకున్న వారు కూడా ఎక్కువ సంఖ్యలో మృత్యువాతపడ్డారు. అలాగే జూన్ మూడోవారం, జులై మొదటి వారంలో బీహార్‌లో ఏకంగా 50 మంది వరకు మృత్యువాతపడ్డారు. ఆ రెండు రాష్ట్రాల్లో గత నెల రోజుల వ్యవధిలో పిడుగుల కారణంగా సంభవించిన మరణాలు వందకు పైనే..

Lightning Strikes

ఇంతకీ పిడుగులు ఎలా ఏర్పడతాయి?

ఆవిరి రూపంలో నీటితో కూడిన మేఘాలు పరస్పరం ఢీకొట్టడం వల్లే పిడుగు ఏర్పడుతుంది. ఎత్తైన చెట్లు, స్థంభాల ద్వారా ఆ విద్యుత్ తరంగాలు భూమిలోకి వెళ్తాయి. అలా వెళ్లే సమయంలో వాటి కింద ఏమి ఉన్నా మాడి మసై పోతాయి. ఒక్కో సారి మైదాన ప్రాంతంలో కూడా పిడుగులు భూమి లోపలికి వెళ్తాయి. వర్షం కురిసినప్పుడే కాకుండా.. వేసవిలోనూ పిడుగులు పడుతుంటాయి. వాతావరణంలో మార్పు కూడా పిడుగుకు కారణం.

ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో దాదాపు 25 వేల అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతాయి. అయితే పై నుంచి సూర్యరశ్మి అధిక వేడితో తాకడం వల్ల తక్కువ బరువున్న ధనావేశిత మేఘాలు పైకి వెళ్తాయి. అధిక బరువుండి, ఎలక్ట్రాన్లు అధికంగా ఉన్న రుణావేశిత మేఘాలు కిందికి వస్తాయి.ఆ క్రమంలోనే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై, విద్యుత్‌ క్షేత్రంగా మారి భూమ్మీదకు దూసుకొస్తాయి. దాన్నే ‘పిడుగుపాటు’ అంటాం. అధిక ఉష్ణోగ్రతలు ఉండే సముద్ర తీర ప్రాంతాల్లోనే పిడుగులు ఎక్కువగా పడతాయట.

పిడుగులను ముందుగానే గుర్తించే పరిజ్ఞానం

మన దేశంలో వర్షాకాలంలో (జూన్-సెప్టెంబర్) పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి.. ఏప్రిల్, మే మాసాల్లో అకాల వర్షాలు కురిసిన సమయంలోనూ పిడుగులు పడుతాయి. పిడుగులకు సంబంధించి ముందుగానే హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం దామిని అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. Damini: Lightning Alert అనే ఈ యాప్‌ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ జీపీఎస్ లొకేషన్ తెలుసుకోవడానికి యాప్‌కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.

వచ్చే 15 నిమిషాల్లో మీరున్న ప్రాంతంలో పిడుగులు పడే అవకాశముందే లేదో ఈ యాప్ ద్వారా తెలుసుకునేందుకు వీలుంటుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ(ఐఐటీఎం) 2020లో ఈ యాప్‌ను రూపొందించింది. జీపీఎస్ లొకేషన్ ఆధారంగా 20 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుల గురించి ఈ యాప్ ముందుగానే హెచ్చరిస్తుంది. పిడుగులు పడే ప్రాంతంలో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ యాప్ చెబుతుంది.

పిడుగుపాటును ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ దగ్గరుంది. ఎర్త్ నెట్‌వర్క్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సెన్సార్లు ఏర్పాటు చేసి, ఎక్కడ ఏ సమయంలో పిడుగులు పడుతుందో ఓ అంచనాకు వస్తారు. ఫోన్లకు ఎస్సెమ్మెస్‌ల ద్వారా పిడుగులకు సంబంధించి సమాచారాన్ని పంపి అక్కడి జనాన్ని అప్రమత్తం చేస్తారు. పిడుగు పడబోయే అరగంట ముందే అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఎత్తైన చెట్లు, భవనాలపైనే పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి. అలాగే పిడుగులు పడే అవకాశమున్న మండలాలకు సంబంధించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏపీ విపత్తు నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారమిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

ప్రకృతి బాణాలేస్తోంది. మామూలు బాణాలు కాదు. విద్యుత్‌ బాణాలు. వానాకాలం, ఎండాకాలం అన్న తేడాలేదు. మృత్యువును పరిచయం చేసే పిడుగు ఎప్పుడైనా మనపై దాడి చేయొచ్చు. అందుకు వేదిక మాత్రం క్యుములోనింబస్‌ మేఘాలే. ఈ మాయదారి మేఘాల్ని అంచనా వేయడంలో కొంచమైనా ముందడుగు వేశాం. క్యుములోనింబస్‌ మేఘాలు… పిడుగులు పడటానికి ఇవే ప్రధాన కారణంగా తేలింది. పిడుగులు సృష్టించే బీభత్సం ప్రపంచానికి కొత్తేమీకాదు.

Lightning Strikes

పిడుగుల నుంచి తప్పించుకోవడం ఎలా?

ఏటా పిడుగు పాటు కార‌ణంగా దేశంలో వంద‌ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గాయపరచడం ఉండదు. అనారోగ్యానికి గురిచేసే సమస్యేలేదు. సెకన్లలో ప్రాణం తీసేస్తుంది. దూరంగా చూడడానికి అందంగా ఉన్నా.. వినడానికి మాత్రం భయంకరంగా ఉంటుంది. ఉరుములు, మెరుపుల మధ్య మెరుపు వేగంతో ప్రాణాలు తీసేస్తుంది. వానాకాలం మొదలయ్యిందంటే ఈదురుగాలు, కుండపోత వర్షాలే కాదు.. వాటితో పాటు ఉరుములతో కూడిన మెరుపులు.. చెవులకు చిల్లులుపడే శబ్దాలతో పిడుగులు.. నెత్తిన పడి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ సీజన్‌లోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వరసబెట్టి పడుతున్న పిడుగులు పదులకొద్దీ ప్రాణాల్ని కడతేరుస్తున్నాయి.

చిన్నచిన్న జాగ్రత్తలతో పిడుగు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు ఇంటి నుంచి బయటికి రాకపోవడమే మేలంటున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటే.. చెట్ల కిందకి, టవర్ల కిందకు వెళ్లకూడదని సూచిస్తున్నారు నిపుణులు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. పిడుగు పాటు నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నట్లయితే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. లేకుంటే రబ్బరు చెప్పులు ధరించి చెవులు మూసుకుని మోకాలిపై కూర్చోవాలి. ఇంట్లో ఉన్నట్లయితే కిటికీలు,తలుపులు మూసివేయాలి.

వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు పిడుగుల బారి నుంచి తప్పించుకునే అవకాశముంది. ఎందుకంటే.. నేరుగా పిడుగులను ఆకర్షించే తత్వం వాహనాలకు ఉండదు. అందుకే ఉరుములు, మెరుపుల సమయంలో మీరు కారులో ఉంటే.. అక్కడే ఉంటే మంచిది. పిడుగులు పడే సీజన్లో వాతావరణ శాఖ సందేశాల్ని సీరియస్‌గా తీసుకుంటూ, కాసింత అప్రమత్తంగా ఉంటే చాలు.. పిడుగుపాటు నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చన్నమాట.

  • ఉరుములు, మెరుపులు వస్తుంటే ఇంటి నుంచి బయటకి రాకపోవమే మంచిది.
  • పొలాల్లో పనిచేసే రైతులు ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి
  • చెట్లు, టవర్ల కింద వెళ్లకూడదు
  • నీటి ప్రవాహాలు, చెరువులు, కుంటల్లో ఉండకూడదు
  • సెల్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించకూడదు
  • ఇళ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, కంప్యూటర్లు ఆపేయాలి
  • ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలకు దూరంగా ఉండాలి.

Lightning Strikes

 

అర్జునా.. ఫాల్గుణ నామ జపాలు ఎందుకు?

పెద్దశబ్ధంతో కూడిన పిడుగు పడేటప్పుడు గ్రామాల్లో చాలా మంది అర్జునా, ఫాల్గుణా అంటూ పది నామాలు జపిస్తారు. అర్జునుడి నామాన్ని తలుచుకుంటే పిడుగులు భయం పోతుందని భావిస్తారు.

అర్జునః ఫాల్గుణః పార్థా కిరీటీ శ్వేతవాహనా
బీభత్స విజయః కృష్ణ సవ్యసాచి ధనుంజయః

ఇవన్నీ అర్జునుడి బిరుదులే. పిడుగు పడినప్పుడే కాదు భయాందోళనలు కలిగినపుడు కూడా అర్జునుడి నామాన్ని జపించవచ్చు. ఫాల్గుణ నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వలన అర్జునుడు పిడుగులని అదుపు చేయగలడని, పిడుగులు పడుతున్నప్పుడు అర్జునుడిని ఫాల్గుణ నామంతో మననం చేసుకుంటే ఆ ప్రభావం, ఆ భయం ఉండదని ధైర్యం వస్తుందని చెబుతారు.