పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజే ‘పాత సీన్’ ఒకటి కనిపించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్య చిన్న పాటి దుమారం రేపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మలపై పర్సనల్ కామెంట్ చేశారు. ఆమెకున్న సమస్యలను ఈ దేశ ఆర్థిక పరిస్థితి మరింత పెంచిందని ఆయన అన్నారు. దీంతో పలువురు బీజేపీ సభ్యులు అడ్డు తగులుతూ ఆయన సభకు క్షమాపణ చెప్పాలని, మహిళలను అవమానపరుస్తున్నాడని అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే సౌగత్ రాయ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
సౌగత్ కామెంట్ పై స్పందించిన నిర్మలా సీతారామన్.. ఇతరులపై కామెంట్లు చేసే బదులు ఈ బిల్లులోని అంశాల పట్ల ఆయన శ్రధ్ధ చూపాలని పేర్కొన్నారు. కానీ… తానేమీ అనుచితంగా మాట్లాడలేదని సౌగత్ రాయ్ తనను తాను సమర్థించుకున్నారు.