KPCC: కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం.. కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధృవ నారాయణ్ కన్నుమూత

Dhruvanarayan: కర్నాటక కాంగ్రెస్‌ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌. ధృవ నారాయణ గుండెపోటుతో కన్నుమూశారు.

KPCC: కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం.. కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధృవ నారాయణ్ కన్నుమూత
Druva Narayan

Updated on: Mar 11, 2023 | 10:25 AM

కర్నాటక కాంగ్రెస్‌ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌. ధృవ నారాయణ గుండెపోటుతో కన్నుమూశారు. ఈ మేరకు డీర్‌ఎంస్‌ వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన వయసు 61. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా కాంగ్రెస్ తరుఫున బాధ్యతలు నిర్వహించారు. ధృవ నారాయణకు ఛాతిలో నొప్పి రావడంతో ఆయన డ్రైవర్‌ ఫిబ్రవరి 4వ తేదీన తెల్లవారుజామున ఆయన్ను మైసూరులోని డిఆర్‌ఎంఎస్ ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు వైద్యులు తెలిపారు. అయితే, చికిత్స అందించినప్పటికీ నారాయణ ఆరోగ్యం విషమించి మృతి చెందినట్టు తెలిపారు. దీంతో ఆయన కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ధృవ నారాయణ్.. 1961 జూలై 31న చామరాజనగర్‌లోని హగ్గవాడిలో జన్మించారు. బెంగళూరులోని జీకేవీకేలో పట్టభద్రుడయ్యారు. గత రెండేళ్లుగా కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఈసారి నంజనగూడు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. దళిత నేతగా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు.

1983లో కాంగ్రెస్‌లో చేరిన ధృవనారాయణ్ 1984లో జీకేవీకే ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం 1986లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 1999లో తొలిసారిగా సంతేమరల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ, 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓకే ఒక్క ఓటు తేడాతో గెలిచి చరిత్ర సృష్టించారు.

2008లో కొల్లేగల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే ఓటమి తర్వాత కూడా పార్టీలోనూ, నియోజకవర్గంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు.

ధృవనారాయణ ఎంపీగా ఉన్నప్పుడు గ్రాంటు వినియోగం విషయంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. చామరాజనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన నంజనగూడు నియోజకవర్గంపై కన్నేశారు. ఈసారి నంజనగూడు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానిక కార్యకర్తలతో, ప్రజలతో తరుచుగా సమావేశమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన గుండెపోటుకు గురై.. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..