Kishan Reddy: రాహుల్ గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు : కిషన్ రెడ్డి

రాహుల్ గాంధీకి ఎన్నికల వ్యవస్థపై సరైన అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ కామెంట్ చేశారు. ఓటర్ లిస్ట్ సవరణ కోసం జరిగే SIR ప్రక్రియ సాధారణమని, దీనివల్ల బీజేపీకి లాభం అయ్యిందన్న ఆరోపణలు ఎక్కడా నిరూపితం కాలేదని చెప్పారు.

Kishan Reddy: రాహుల్ గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు : కిషన్ రెడ్డి
Kishan Reddy Slams Rahul Gandhi

Updated on: Dec 10, 2025 | 7:11 PM

రాహుల్ గాంధీకి ఎన్నికల వ్యవస్థ మీద స్పష్టమైన అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సరిదిద్దేందుకు జరిగే SIR (Special Intensive Revision) ఒక సాధారణ, అవసరమైన ప్రక్రియ అని చెప్పారు. థర్డ్ పార్టీ ఏజెన్సీలు చేసిన విశ్లేషణల్లో కూడా SIR వల్ల బీజేపీ లేదా ఎన్డీఏకి లాభం అయ్యిందన్న ఆరోపణలు ఎక్కడా నిరూపితం కాలేదని చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక కాంగ్రెస్.. కారణాలు వెతుక్కుంటూ.. తప్పు వాదనలు ప్రచారం చేస్తుందని చెప్పారు. ఒకవైపు రాహుల్ గాంధీ, ఓటర్ లిస్ట్‌లో తప్పులు ఉన్నాయంటారని.. మరోవైపు వాటిని సరిచేయడానికి జరిగే SIR ప్రక్రియను విమర్శించడం సరైన పద్దతి కాదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

CEC ఎంపికలో CJI ఎందుకు లేడన్న రాహుల్ గాంధీ ప్రశ్నపై స్పందిస్తూ.. ఈ ప్రక్రియలో CJI ఎప్పుడూ ఉండేవారు కాదని.. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వాల కాలం నుంచే ఉన్న విధానం అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. CEC ఎంపికకు విపక్ష నేత కూడా సభ్యుడే అని.. అందులో రాహుల్ గాంధీ పాత్ర కూడా ఉందని గుర్తు చేశారు. పోలింగ్ అనంతరం 45 రోజులకు CCTV ఫుటేజ్ తొలగించడంపై రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. ఎన్నికల ఫిర్యాదులు పరిష్కరించడానికి ఇచ్చే గడువు అదే అని, దీని తర్వాత ఫుటేజ్ డిలీట్ చేయడం సాధారణమేనని కిషన్ రెడ్డి తెలిపారు. CEC‌పై పదవిలో ఉన్నప్పుడు నేరుగా చర్యలు తీసుకోలేమన్న నిబంధన కూడా కాంగ్రెస్ కాలంలోనే వచ్చినదని చెప్పారు. రాజ్యాంగ సంస్థల స్వతంత్రత కోసం ఇవి అవసరమని పేర్కొన్నారు.

హర్యానా ఎన్నికలపై రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలన్నీ ఇప్పటికే ఫాల్స్ అని ఫ్రూవ్ అయ్యాయని.. పాత జాబితాల ఆధారంగా వచ్చిన పొరపాట్లను ఇప్పుడు సరిచేయడంపై ఎందుకు ఇంత అభ్యంతరం చెబుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. EVMలపై ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితి లేరని, ఇప్పుడు ఓట్లు దొంగిలించారంటూ.. కొత్త కథనాలు అల్లడం కూడా సత్యదూరమైన విషయమేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ లోపాలను కప్పిపుచ్చుకోవడానికే ఎన్నికల సంఘంపై విమర్శలు పెడుతుందన్నారు. ఇలా కొనసాగితే ప్రజల్లో నిరాశ మరింత పెరుగుతుందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.