
Nitin Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. టోల్ ఛార్జీల చెల్లింపునకు సంబంధించిన త్వరలో కీలక మార్పులు తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటివరకు టోల్ ఫీజు చెల్లించాలంటేటోల్ గేట్ల వద్ద క్యూలైన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ ఉన్నా క్యూలైన్‌లో ఉంది స్కాన్ చేసేంతవరకు వేచి ఉండాల్సి ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయం, పండుగ సమయాల్లో టోల్ గేట్ల వద్ద వాహనదారులు బారులు తీసి ఉంటారు. ఈ సమయంలో టోల్‌గేట్‌ను దాటుకుని పోవాలంటే ఇంకా ఎక్కువ సమయం వెయిట్ చేయాలి. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా త్వరలో టోల్ ఛార్జీలను సులువుగా చెల్లించేందుకు ఎలక్ట్రానిక్ వ్యవస్థను తీసుకురానున్నట్లు నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ ఏడాదిలోగా దీనిని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే ఇక టోల్‌గేట్ల వద్ద ఆగాల్సిన అసవరం ఉండదు.
ఇప్పటివరకు టోల్ గేట్ దగ్గర వాహనం ఆపితే.. ఫాస్టాగ్ స్కాన్ అయ్యేంతవరకు వాహనం ఆగాలి. స్కాన్ అయ్యాక వాహనాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు. కానీ కొత్త విధానంలో వాహనాన్ని ఆసలు టోల్‌గేట్ వద్ద ఆపకుండానే పేమెంట్ జరుగుతుంది. తొలుత ఈ టెక్నాలజీని 10 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నట్లు నితిన్ గడ్కరీ చెప్పారు. వాహనం ఆగకుండానే ఫాస్టాగ్ ద్వారా చెల్లింపు జరిగేలా టెక్నాలజీని తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నూతనంగా ఎలక్ట్రానిక్ టోల్ కనెక్షన్ సిస్టమ్‌ను అభివృద్ది చేసింది. ఇది టోల్ చెల్లించడానికి ఇదొక విశిష్ట, ఇంటర్ఆపరబుల్ ప్లాట్‌ఫాంగా ఉంటుంది. ఏఐను ఉపయోగించి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో దీనిని అభివృద్ది చేశారు. ఇక వాహనం ఆగకుండానే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నినేషన్ ద్వారా ఫాస్టాగ్ నుంచి పేమెంట్ అవుతుంది. ఇప్పటికే హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై పలుచోట్ల ఈ విధానం అమలవుతున్నట్లు తెలుస్తోంది.