Gold Smuggling: నాయమ్మే.. నా తల్లే..! స్మగ్లింగ్‌లో లేడీ పుష్ప అనుపించుకున్నావులే.. మరీ ఇలానా..

|

Dec 27, 2022 | 3:19 PM

Gold Smuggling: వారి ఆర్థిక అవసరాలే.. వీరి వ్యాపారానికి పెట్టుబడి. అభం శుభం తెలియని వారికి డబ్బు ఆశ చూపి.. గుట్టు చప్పుడు కాకుండా స్మగ్లింగ్ నిర్వహిస్తున్నారు కేటుగాళ్లు. అంతేనా..

Gold Smuggling: నాయమ్మే.. నా తల్లే..! స్మగ్లింగ్‌లో లేడీ పుష్ప అనుపించుకున్నావులే.. మరీ ఇలానా..
Kerala Smuggling
Follow us on

వారి ఆర్థిక అవసరాలే.. వీరి వ్యాపారానికి పెట్టుబడి. అభం శుభం తెలియని వారికి డబ్బు ఆశ చూపి.. గుట్టు చప్పుడు కాకుండా స్మగ్లింగ్ నిర్వహిస్తున్నారు కేటుగాళ్లు. అంతేనా.. అధికారుల కంట పడకుండా బంగారాన్ని ఎలా దాచాలో కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ విషయంలో అమ్మాయిలు అయితే సేఫ్ అని భావిస్తున్నారు స్మగ్లర్లు. మరి అధికారులు ఊరుకుంటారా? ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్నెన్ని నక్కజిత్తుల వేశాలు వేసినా.. ఇట్టే పట్టేస్తారు. తాజాగా బంగారాన్ని ఇన్నర్‌వేర్‌లో దాచి అక్రమంగా తరలిస్తున్న 19 ఏళ్ల ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఆమె నుంచి కోటి రూపాయల విలువైన బంగారం మిశ్రమాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మలప్పురం జిల్లా పోలీస్ చీఫ్ సుజిత్ దాస్‌కు బంగారం అక్రమ రవాణాపై సమాచారం అందింది. దాంతో పోలీసులు.. కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX-346 లో వచ్చిన ప్రయాణికులందరినీ తనిఖీ చేశారు. కాసరగోడ్‌కు చెందిన 19 ఏళ్ల యువతి షహలా అనుమానాస్పదంగా కనిపించగా.. ఆమెను అదుపులోకి తీసుకుని అంతా చెక్ చేశారు. ఆ సమయంలో షహలా అధికారులతో వాగ్వాదానికి దిగింది. తాను స్మగ్లర్‌లా కనిపిస్తున్నానా? అంటూ వారిపైనే ఫైర్ అయ్యింది. ఎలాంటి నిషిద్ధ పదార్థాలు తీసుకెళ్లడం లేదని, బంగారం కూడా తన వద్ద లేదని చెప్పింది. కానీ, పోలీసులు, కస్టమ్స్ అధికారులు తమ పని తాము చేశారు. ఆమె లగేజీ పరిశీలించగా అందులో బంగారం కనిపించలేదు.

చివరగా ఆమె దుస్తులను మహిళా అధికారులు చెక్ చేశారు. అప్పుడు అసలు దందా బయటపడింది. లో దుస్తుల్లో బంగారం పేస్ట్‌ ని కనిపెట్టారు. మూడు ప్యాకెట్లను గుర్తించారు అధికారులు. ప్యాంటీలోంచి ఒక బంగారం ప్యాకెట్, బ్రా లోంచి రెండు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తం 3 ప్యాకెట్లలో 1.8 కేజీల బంగారం పేస్ట్‌ను గుర్తించి, సీజ్ చేశారు అధికారులు. జాబ్ ఇంటర్వ్యూ కోసం గల్ఫ్ ‌కు వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పిన షహలా.. 6 రోజుల పాటు దుబాయ్‌కి వెళ్లింది. అయితే, స్మగ్లింగ్ క్యారియర్‌గా చేసేందుకు షహలా రూ. 60 వేలు ఒప్పందం చేసుకుంది. ఇంతకు ముందు క్యారియర్‌గా వ్యవహరించిన షహలా స్నేహితుడే.. ఆమెకు స్మగ్లింగ్‌ రాకెట్‌తో పరిచయం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

కాగా, షహలాను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బంగారం అక్రమ రవాణాపై విచారణ జరుపుతున్నారు. స్మగ్లింగ్ ఆపరేషన్‌లో ఎవరెవరు ఉన్నారనేదానిపై కూపీ లాగుతున్నారు. కాగా, కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జనవరి నుంచి ఇప్పటి వరకు బంగారం అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకోవడం ఇది 87వ కేసు. అయితే, ఈ మధ్య కాలంలో స్మగ్లింగ్ కోసం కేటుగాళ్లు యుక్త వయస్సు యువతీ యువకులను ఉపయోగించుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అధికారులు మరింత అలర్ట్ అయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..