
మరికొన్ని రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పొలిటికల్ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదలుకోవడానికి ఇష్ట పడ్డం లేదు.. రాజకీయ పార్టీలు. ఇదే క్రమంలో కేరళలో జరిగిన ఓ విద్యార్ధి ఆత్మహత్య వ్యవహారం.. పొలిటికల్ టర్న్ తీసుకోంది. అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ టార్గెట్‌గా..ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇంతకూ అసలేం జరిగింది..
కేరళలో వెటర్నరీ విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. వయనాడ్ జిల్లాలోని వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్శిటీలో సెకండ్ ఇయర్ చదువుతున్న జేఎస్ సిద్ధార్థ్ అనే విద్యార్ధి..గత నెల 18న కాలేజీ హాస్టల్ బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని కనిపించాడు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగుచూసింది.
ఈ కేసును దర్యాప్తు చేసేందుకు 20 మంది సభ్యులతో కూడిన బృందాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణతో కొంతమంది విద్యార్ధులు సిద్ధార్థ్‌ను..హాస్టల్‌తో పాటు కాలేజీ వెనుక ఉన్న కొండపై మూడు రోజులు చిత్రహింసలు పెట్టి తీవ్రంగా కొట్టినట్లు విచారణలో తేలింది. ఈ వేధింపులను తట్టుకోలేకే సిద్దార్ధ్ ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. దీంతో IPCతో పాటు కేరళ ర్యాగింగ్ నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 18 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్ చేశారు.
అయితే ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులను అధికార పార్టీ సీపీఎం కాపాడుతోందని మృతుడు సిద్ధార్థ్ తండ్రి జయప్రకాశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అరెస్టయిన ఆరుగురిలో ప్రధాన నిందితులు లేరని..కొంతమంది నేతలు వారిని కాపాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మొత్తం 12 మంది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలే అని జయప్రకాశ్ చెబుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారం కేరళలో రాజకీయ దుమారానికి దారితీసింది.
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌తో పాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్, కేంద్ర మంత్రి వి.మురళీధరన్‌లు తిరువనంతపురంలోని సిద్ధార్ధ్ కుటుంబాన్ని పరామర్శించారు. వర్సిటీ అధికారుల వైఫల్యంతో పాటు కేరళ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే విద్యార్ధి సిద్ధార్ధ్ మరణించాడని గవర్నర్ ఆరిఫ్‌ఖాన్ ఆరోపించారు. పార్టీ ఒత్తిడి వల్లే ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదన్నారు. రాష్ట్రంలోని ప్రతియూనివర్సిటీలోని ఒక హాస్టల్‌ను ఎస్‌ఎఫ్‌ఐ తన హెడ్‌క్వార్టర్‌గా ఉపయోగించుకుంటోందని..అందులోకి వెళ్లేందుకు వర్సిటీ అధికారులు కూడా భయపడతారని గవర్నర్ ఆరోపించారు. ఈ కేసు విచారణలో పోలీసులకు ప్రభుత్వం సహకరించడం లేదని విమర్శించారాయన.
కేరళ కాలేజీ క్యాంపస్‌లు ఎస్‌ఎఫ్‌ఐ నియంత్రణలో ఉన్నాయని దాంతో విద్యార్థులకు భద్రత లేకుండా పోతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేరళ ప్రభుత్వం మాత్రం నిందితులు ఏ సంస్థకు చెందిన వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతోంది. ఈ కేసు దర్యాప్తు కోసం సీఎం విజయన్ ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారని చెబుతున్నాయి.