Ayyappa devotees: శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములూ..జర జాగ్రత్త! నదీ స్నానాల్లో ముక్కులోకి నీరు పోనివ్వొద్దు

అయ్యప్ప స్వాములూ..జర జాగ్రత్త! కేరళ నదుల్లో చెరువుల్లో స్నానానికి దిగేముందు కొన్ని జాగ్రత్తలు పాటించండి. లేదంటే అంతే సంగతులు. బ్రెయిన్‌ ఈటర్‌ అమీబా బారినపడే అవకాశం ఉంది. అది మీ బాడిలో చేరితే, బ్రెయిన్‌ ఫీవర్‌తో పరిస్థితి ప్రాణాంతకంగా మారే చాన్స్‌ ఉంది.

Ayyappa devotees: శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములూ..జర జాగ్రత్త! నదీ స్నానాల్లో ముక్కులోకి నీరు పోనివ్వొద్దు
Ayyappa Devotees

Updated on: Nov 23, 2025 | 5:14 PM

కేరళలో అయ్యప్ప దర్శనాలు జరుగుతున్న వేళ బ్రెయిన్‌ ఫీవర్‌ టెన్షన్‌ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కేరళలో స్నానాలు చేసే వేళ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వైద్యులు సైతం తగు సూచనలు చేస్తున్నారు. కేరళ సర్కార్‌ హెచ్చరికల ప్రకారం.. ఆ రాష్ట్రంలో అమీబిక్ మెనింగోఎన్‌సెఫాలిటిస్ కారణంగా బ్రెయిన్‌ ఫీవర్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో, అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రభుత్వం, వైద్య నిపుణులు కీలక సూచనలు చేశారు. దర్శనం సమయంలో స్నానాలు చేసే ముందు భక్తులు జాగ్రత్తగా ఉండాలి. నీళ్లు ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. లేకపోతే బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా మెదడులోకి చేరుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అమీబా మెదడులోకి చేరితే పరిస్థితి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందన్నారు. అయితే ఈ ఇన్ఫెక్షన్‌ మాత్రం ఒకరి నుంచి మరొకరికి సోకదని వైద్యులు వెల్లడించారు. అధిక జ్వరం ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.

కేరళలో గత 11 నెలల్లో దాదాపు 170 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. వారిలో 41 మంది మరణించారు. ఈ నవంబర్‌ నెలలోనే 17 మంది ఈ వ్యాధి బారినపడగా.. వారిలో ఎనిమిది మంది మృతి చెందినట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అమీబా వల్ల కలిగే మరణాలకు మూలాన్ని కనుగొనడానికి ఆరోగ్య శాఖ అధ్యయనం ప్రారంభించినట్టు వైద్యశాఖ తెలిపింది.

అసలు ఏంటి ఈ బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా. దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల వచ్చే బ్రెయిన్‌ ఫీవర్‌ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.. నదులు, చెరువుల్లో ఉండే బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా…  స్నానం కోసం మునిగినప్పుడు..ముక్కు ద్వారా శరీరంలో ప్రవేశిస్తుంది.  ఇది శరీరంలో ప్రవేశిస్తే..అమీబిక్ మెనింగోఎన్‌సెఫాలిటిస్ అనే బ్రెయిన్‌ ఫీవర్‌ వస్తుంది. దీనివల్ల విపరీతమైన జ్వరం,  తీవ్రమైన తలనొప్పి, వాంతులు ఉంటాయి. నిద్రలేమి సమస్య వెంటాడుతుంది. వ్యాధి తీవ్రం అయితే.. తీవ్రమయ్యే కొద్దీ మూర్ఛ, మానసిక ఆందోళన, కోమా వంటి విపరీత స్థితికి చేరుకుంటారు. అందుకే ముక్కులోకి నీళ్లు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేడినీటిని మాత్రమే తీసుకోవాలి. భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి. సో…శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు, స్వాములు సరైన జాగ్రత్తలు తీసుకుంటే…ఈ బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా బారిన పడకుండా ఉండొచ్చు. కాగా  శబరిమల పరిసర ప్రాంతాల్లోని చెరువులను శుభ్రం చేసి, క్లోరినేషన్‌ చేయాలని ఇప్పటికే అక్కడి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..