Kerala Assembly on Lakshadweep: లక్షద్వీప్​లో రాజకీయ రగడ.. ఎల్‌డీఏ డ్రాఫ్ట్ రెగ్యులేషన్‌ నిలిపేసేందుకు కేరళ హైకోర్టు తిరస్కరణ!

|

May 31, 2021 | 8:12 PM

లక్షద్వీప్​లో రాజకీయ రగడ. స్థానిక ప్రజలకు మద్దతు పెరుగుతోంది. తాజాగా లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ను వెంటనే తొలగించాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి కేరళ అసెంబ్లీ ఎకగ్రీవంగా ఆమోదం.

Kerala Assembly on Lakshadweep: లక్షద్వీప్​లో రాజకీయ రగడ.. ఎల్‌డీఏ డ్రాఫ్ట్ రెగ్యులేషన్‌ నిలిపేసేందుకు కేరళ హైకోర్టు తిరస్కరణ!
Kerala Assembly Passes Resolution Against Lakshadweep Administrator
Follow us on

Kerala Assembly Passes Resolution on Lakshadweep: లక్షద్వీప్​లో రాజకీయ రగడ ముదురుతోంది. స్థానిక ప్రజలకు మద్దతు పెరుగుతోంది. తాజాగా లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ను వెంటనే తొలగించాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి కేరళ అసెంబ్లీ ఎకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

లక్షద్వీప్‌లో పొలిటికల్‌ హీట్‌ తారాస్థాయికి చేరింది. లక్షద్వీప్‌ అభివృద్ధి కోసం అంటూ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ ఖోడా పటేల్‌ ప్రతిపాదించిన అంశాలపై రాజకీయ వేడి మరింత ముదురుతోంది. ప్రఫుల్‌ ఖోడా తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలపై స్థానికుల నిరసనలకు మద్దతు పెరుగుతోంది. తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్‌ లక్షద్వీప్‌ ప్రజలకు మద్దతు ప్రకటించారు. వారికి సంఘీభావం తెలుపుతూ లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ ఖోడా పటేల్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.

లక్షద్వీప్‌ ప్రజల సమస్యపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని.. వారి ఆకాంక్షలను కాపాడటం కేంద్రం బాధ్యతని కేరళ ముఖ్యమంత్రి విజయన్ పేర్కొన్నారు. ప్రఫుల్​ ప్రవేశ పెట్టిన పలు వివాదాస్పద సంస్కరణలను కూడా రద్దు చేయాలని కోరారు. సీఎం విజయన్‌ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీనికి ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలపడం ముఖ్య విశేషం.


దమణ్, దీవ్​లకు అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న ప్రఫుల్​కు లక్షద్వీప్ బాధ్యతలు అప్పగించింది కేంద్రం. లక్షద్వీప్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో ఆయన తీసుకొచ్చిన ప్రతిపాదనలపై స్థానికులు భగ్గుమంటున్నారు. మరోవైపు, ద్వీప ప్రజల ఆందోళనలను ఉధృతం చేసేందుకు ప్రతిపక్షాలు కూడా అస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ మేరకు ఓ కోర్‌ కమిటీని ఏర్పాటుచేయాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి. ఇదిలావుంటే, సమాజ్‌వాదీ జనతా పార్టీ కార్యదర్శి ప్రదీప్‌ గోపాలకృష్ణన్‌ లక్షద్వీప్‌ను కేరళలో భాగం చేయాలని..లక్షద్వీప్‌ అభివృద్ధికి అడ్మినిస్ట్రేటర్‌ పాలనను అంతం చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని రాష్ట్రపతిని కోరారు.

ఈ డిమాండ్‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమర్థించారు. మరోవైపు లక్షద్వీప్ డెవలప్‌మెంట్ అథారిటీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్‌ను నిలిపేసేందుకు కేరళ హైకోర్టు తిరస్కరించింది. ఇది విధానపరమైన అంశమని, తమ అభిప్రాయాలను తెలిపే అవకాశం అన్ని పార్టీలకు లభించాలని తెలిపింది. దీనిపై స్పందించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి, లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంత అడ్మినిస్ట్రేషన్‌కు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Read Also….  కేంద్రంతో ఢీ ఆంటే ఢీ !…చీఫ్ సెక్రటరీ చేత రాజీనామా చేయించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.., ఆ తరువాత …!