కర్ణాటకలోని హాసన్ జిల్లా బేలూరులో ఓ యువకుడిని అతని స్నేహితుడే హతమార్చాడు. మద్యం మత్తులో వాటర్ కలెక్టర్‌గా పనిచేస్తున్న గణేష్ అనే యువకుడిని అతని స్నేహితుడు హత్య చేశాడు. రూ.100 ఇవ్వకపోవడంతో నిందితుడు ఈ హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. హత్య చేసిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
చీకనహళ్లి గ్రామంలోని ఓ హోటల్‌లో శుక్రవారం(సెప్టెంబర్ 13) గణేష్, అతని స్నేహితులు కలిసి పార్టీ చేసుకున్నారు. పార్టీ చేసుకున్న తర్వాత హోటల్ నుంచి బయటకు వచ్చారు. గణేష్ బయటకు రాగానే నిందితుడు రఘు రూ.100 అడిగాడు. గణేష్ పదే పదే డబ్బులు అడిగినా ఇవ్వకపోవడంతో ఆగ్రహం చెందిన రఘు గొడవకు దిగాడు. రఘుతో పాటు అక్కడే ఉన్న మరో స్నేహితుడు మధు గణేష్‌పై దాడికి యత్నించాడు. మధు ఒక పేరుమోసిన రౌడీ షీటర్. మధుపై దాడి చేసిన గణేష్ పారిపోయేందుకు ప్రయత్నించగా.. నిందితులు వెంబడించారు. గణేష్‌ను పట్టుకుని నిందితులు కత్తితో పొడిచి చంపి పరారయ్యారు. గణేష్ హత్యతో కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
బేలూరుకు చెందిన కుంబేరహళ్లి గణేష్ గత ఏడాది కాలంగా చిక్కనహళ్లి గ్రామపంచాయతీలో వాటర్ సప్లై మెన్‌గా పని చేస్తున్నాడు. చీకనహళ్లిలోని ఆటో స్టేషన్ సమీపంలో నివాసం ఉండే రఘుతో స్నేహం ఏర్పడింది. తరుచూ మరికొందరు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేవాడు గణేష్. శుక్రవారం సాయంత్రం కూడా అదే జరిగింది. పార్టీ తర్వాత గొడవ జరిగింది. ఆ తర్వాత హత్య జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు నిందితులపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆరెహళ్లి పోలీసులు తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు హసన్ ఎస్పీ మహ్మద్ సుజిత తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..