Heart Attack : విషాదం.. గుండెపోటుతో మూడో తరగతి విద్యార్థిని మృతి..
హుటాహుటినా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వెంటనే తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలోనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే ఆ విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో ఆ తల్లిదండ్రుల రోదన మిన్నంటింది.
గుండెపోటు.. ఇది ఇప్పుడు ఒక పెద్ద మహమ్మారిలా మారింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వెంటాడుతోంది. కరోనా అనంతర కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆడుతూ పాడుతూ ఉన్న మనుషులు అమాంతంగా కుప్పకూలి ప్రాణాలు విడిచిపెడుతున్న పరిస్థితులు అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇలాంటి మరణాలు చిన్నారుల్లోనూ అనేకం సంభవిస్తున్నాయి. తాజాగా మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల చిన్నారి గుండెపోటుతో మరణించిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మూడో తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషదాన్ని మిగిల్చింది. మధ్యాహ్నం భోజనం చేసి క్లాస్‌కి వెళ్తున్న బాలిక ఉన్నట్టుండి అమాంతంగా కుప్పకూలి మరణించింది. ఈ విషాద సంఘటన యూపీలోని లక్నోలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని వికాస్‌నగర్ సెక్టార్-14లో నివాసముంటున్న శిఖర్ సెంగార్ కుమార్తె మాన్వి మాంట్ ఫోర్ట్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది. ఆమెతో పాటు తన అక్క మహి కూడా 11వ తరగతి చదువుతుంది. ఉదయం మాన్వి, మహి ఇద్దరూ కలిసే స్కూల్‌కి వెళ్లారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మాన్వి తన స్నేహితులతో కలిసి కారిడార్ నుండి క్లాస్ వైపు వెళ్తోంది. ఒక్కసారిగా తడబడి పడిపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న మాన్విని చూసిన ఆమె స్నేహితులు సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించారు. పిలల్ల అరుపులు విన్న టీచర్లు పరిగెత్తుకు వచ్చారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న మాన్విని చూసిన పాఠశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వెంటనే ఫాతిమా ఆస్పత్రికి తీసుకెళ్లింది. కొద్దిసేపటికే మాన్వి తల్లి, రిటైర్డ్ ఐఏఎస్ నానా వీపీ సింగ్ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. వారు బాలికను చందన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. తొమ్మిదేళ్ల చిన్నారి గుండెపోటుతో మరణించిందనే వార్త దావానంలా వ్యాపించింది. తల్లిదండ్రులతో పాటు స్కూల్ టీచర్లు, సిబ్బంది, విద్యార్థులంతా కన్నీరు పెట్టుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి స్కూల్‌లోని సీసీకెమెరాలో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు. ఫుటేజీలో విద్యార్థి ఉన్నట్టుండి కింద పడిపోవడం కనిపించింది. సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫుటేజీని పరిశీలించగా, మాన్వి తన స్నేహితులతో కలిసి కారిడార్ గుండా వెళుతుండగా జారిపడి పడిపోయినట్లు గుర్తించారు. ఇన్ స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబసభ్యులు విద్యార్థినిని ఆస్పత్రికి తరలించారు. మరణానంతరం పోస్టుమార్టం చేసేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. కొన్ని రోజుల క్రితం మాన్వి ఆరోగ్యం క్షీణించిందని, చికిత్స అనంతరం కొలుకుందని చెప్పారు. కానీ, మాన్వికి గుండె సమస్య ఉన్నట్టుగా తెలియలేదని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..