Umesh Katti: కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి హఠాన్మరణం.. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన బీజేపీ కీలక నేత..

|

Sep 07, 2022 | 6:46 AM

Umesh Katti: మంత్రి ఉమేష్ కత్తి.. డాలర్స్ కాలనీలోని తన నివాసంలో బాత్‌రూమ్‌లో రాత్రి స్పృహ తప్పి పడిపోయారు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఉమేష్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన

Umesh Katti: కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి హఠాన్మరణం.. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన బీజేపీ కీలక నేత..
Umesh Katti
Follow us on

Karnataka minister Umesh Katti dies: కర్ణాటక ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేష్ విశ్వనాథ్ కత్తి (61).. మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. మంత్రి ఉమేష్ కత్తి.. డాలర్స్ కాలనీలోని తన నివాసంలో బాత్‌రూమ్‌లో రాత్రి స్పృహ తప్పి పడిపోయారు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఉమేష్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీనిపై రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్‌.అశోక మాట్లాడుతూ.. ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి కత్తి ఉమేష్‌కు పల్స్‌ లేదని వైద్యులు తెలిపారన్నారు. కత్తి మరణం బీజేపీకి, బెళగావి జిల్లాకు తీరని లోటు అని ఆయన విచారం వ్యక్తంచేశారు.

బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంలో ఉమేష్ కత్తి రెండు.. పోర్ట్‌ఫోలియోలను నిర్వహిస్తున్నారు. అటవీ, ఆహారం పౌర సరఫరా శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మంత్రి ఉమేష్ కత్తి మరణంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తన సన్నిహిత సహచరుడు కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఉమేష్‌ కత్తి అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతితో రాష్ట్రం నిపుణుడైన దౌత్యవేత్తను, చురుకైన నాయకుడిని, నమ్మకమైన ప్రజా సేవకుడిని కోల్పోయిందంటూ సీఎం బొమ్మై ట్వీట్ చేశారు. వెంటనే ముఖ్యమంత్రి ఆస్పత్రిని సందర్శించారు.

మంత్రి మృతిపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. “ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉమేష్ కత్తి మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అంటూ ట్విట్ చేశారు.

8 సార్లు ఎమ్మెల్యేగా.. 

బెలగావి జిల్లాకు చెందిన సీనియర్ మంత్రులలో ఒకరైన ఉమేష్ కత్తి హుక్కేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలించారు. ఆయన అంతకుముందు ముఖ్యమంత్రి కావాలనే కోరికను సైతం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రత్యేక ఉత్తర-కర్ణాటక రాష్ట్ర హోదా కోసం తరచుగా వార్తల్లో నిలిచేవారు.

1985లో తన తండ్రి విశ్వనాథ్ కత్తి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 2008లో బీజేపీలో చేరడానికి ముందు కత్తి జనతాపార్టీ, జనతాదళ్, జేడీ(యూ), జేడీ(ఎస్)లలో పలు హోదాల్లో పనిచేశారు. గతంలో జేహెచ్ పటేల్, బీఎస్ యడ్యూరప్ప, డీవీ సదానంద గౌడ, జగదీశ్ శెట్టర్ నేతృత్వంలోని మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు.

ఉమేష్ కత్తి మృతదేహాన్ని ఎయిర్ అంబులెన్స్‌లో స్వగృహానికి తరలించనున్నారు. సంకేశ్వరలో మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శన తర్వాత అన్ని ప్రక్రియలు జరుగనున్నాయి. బాగేవాడి బెళగావిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సీఎం బొమ్మై తెలిపారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని పేర్కొన్న ముఖ్యమంత్రి.. తాను అత్యంత సన్నిహిత మిత్రుడిని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఆయనకు కొన్ని గుండె జబ్బులు ఉన్నాయని.. ఇంత త్వరగా చనిపోతాడని తాము ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఆయన రాష్ట్రం కోసం చాలా పని చేశారు. అనేక శాఖలను సమర్ధవంతంగా నిర్వహించారని తెలిపారు.

బెలగావిలో పాఠశాలలు, కళాశాలలకు సెలవు..

ఉమేష్ కత్తి మృతితో బెళగావిలోని పాఠశాలలు, కళాశాలలకు కర్ణాటక ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..