డిప్యూటీ సీఎం పదవి ఇవ్వమని అమ్మవారిని వేడుకున్న శ్రీరాములు

అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గాదేవిని కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి బి.శ్రీరాములు ఆసక్తికరమైన కోరికను కోరారు. షాహపూర్‌లోని దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించిన ఆయన అమ్మవారి..

డిప్యూటీ సీఎం పదవి ఇవ్వమని అమ్మవారిని వేడుకున్న శ్రీరాములు

Updated on: Sep 19, 2020 | 3:49 PM

అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గాదేవిని కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి బి.శ్రీరాములు ఆసక్తికరమైన కోరికను కోరారు. షాహపూర్‌లోని దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించిన ఆయన అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు. అమ్మవారి పాదాల చెంత ఓ పేపర్‌ను పెట్టారు.. దేవిని ప్రార్థించారు. లిఖితపూర్వక అభిలాషను నెరవేర్చాల్సిందిగా వేడుకున్నారు. ఆ పేపర్‌లో ఏం రాశారన్నది అక్కడున్నవారికి ఆసక్తిగొలిపింది.. విలేకరులకు కూడా క్యూరియాసిటీ పెరిగింది.. విషయాన్ని శ్రీరాములు నుంచే తెలుసుకుందామనే ప్రయత్నం చేశారు.. ‘ఏముందో ఎలా చెబుతాను.. అది నాకు అమ్మవారికి మధ్య ఉన్న విషయం’ అంటూ తేల్చేశారు. విలేకరులు ఊరుకుంటారా? వెళ్లి ఆలయ పూజారి మారెప్పను కలిశారు.. విలేకరులకు పూజారి వరమిచ్చాడు.. ఆ పేపర్‌లో ఏం రాశారో చెప్పేశారు.. ఇంతకీ శ్రీరాములు ఏం కోరుకున్నారట అంటే.. తనను డిప్యూటీ సీఎంను చేయమని వేడుకున్నారట! తన కోరికను వీలైనంత తొందరలో తీర్చమంటూ ప్రార్థించారట! శ్రీరాములు అమ్మవారికి వీరభక్తుడు. కరోనా వైరస్‌ ప్రబలిపోతున్న సమయంలోనూ ఆరోగ్యశాఖ మంత్రి బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆయన నిమ్మలంగా ఉన్నారు.. అంతా అమ్మవారే చూసుకుంటారని ఒక్క ముక్కలో తేల్చేశారు. షాహపూర్‌ దుర్గాదేవి ఆలయంలో ఇలా భక్తులు తమ కోరికలను పేపర్‌మీద రాసి అమ్మవారి పాదాల చెంత ఉంచడం ఆనవాయితీ! ప్రార్థనలు అయ్యాక ఆ పేపర్‌ను పూజారికి అందిస్తారు. శ్రీరాములు కూడా అలాగే చేశారు.. ఈ ఏడాది ఆరంభంలో కర్నాకట కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌ కూడా దుర్గాదేవిని దర్శించుకున్నారు.. మనీ లాండరింగ్‌ కేసులో జైలు శివకుమార్‌ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే! జైలు నుంచి విడుదల కాగానే ఆయన మొదట వెళ్లింది షాహపూర్‌ ఆలయానికే!
నిరుడు జులైలో యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే తనకు డిప్యూటీ సీఎం పదవి గ్యారంటీ అని అనుకున్నారు శ్రీరాములు.. కాని అధిష్టానం మరోటి అనుకుంది.. మూడు డిప్యూటీ సీఎం పదవులనైతే కేటాయించింది కానీ ఒకటి లింగాయత్‌లకు, రెండోది వొక్కలింగాలకు, మూడోది దళితులకు కట్టబెట్టింది.. కర్నాటకలో ఈ మూడు సామాజికవర్గాలు ప్రధానమైనవే! దాంతో శ్రీరాములు కోరిక నెరవేరకుండాపోయింది.. కనీసం ఇప్పుడైనా ఆ పదవి తనకు వచ్చేలా చూడమని అమ్మవారిని వేడుకున్నారాయన!
జగదేక మాతా గౌరీ. కరుణించవే భవానీ కరుణించవే అంటూ భక్తిగీతాలు పాడుకుంటున్నారు..