కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో చిక్కుల్లో పడ్డ సంకీర్ణ ప్రభుత్వానికి స్వతంత్ర ఎమ్మెల్యే, మంత్రి అయిన హెచ్.నగేష్ కూడా షాకిచ్చారు. సోమవారం గవర్నర్‌ను కలిసిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆ సందర్భంగా ఆయన గవర్నర్‌తో మాట్లాడుతూ.. హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తేల్చి చెప్పారు. అంతేకాదు, ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తే తన మద్దతు కమలం పార్టీకే ఉంటుందని నగేష్ స్పష్టం చేశారు. దీంతో కుమారస్వామి శిబిరం నుంచి ఓ ఎమ్మెల్యే బీజేపీకి జై కొట్టినట్టు ఈ పరిణామంతో తేలిపోయింది.
కాగా, మరో స్వతంత్ర ఎమ్మెల్యే, మంత్రి ఆర్. శంకర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ను కలిసిన ఆయన… సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తే.. మద్దతు తెలుపుతానంటూ స్పష్టంచేశారు.