Heavy Rain: తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నార్త్ కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహానికి ఆవులు కొట్టుకుపోయాయి. దీంతో కర్ణాటక కోస్టల్ ఏరియాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, మరి కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. బెల్గాం, ధార్వాడ్, మంగళూరులో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగాయి. కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు శిథిలావస్థకు చేరాయి.
అలాగే మహారాష్ట్రలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. గతవారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. ముంబై మహానగరంతో పాటు రాష్ట్రంలోని పలు నగరాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయింది. ముంబై శివారులోని భివాండిలో వరద పోటెత్తింది. వందలాది ఇళ్లు నీట మునిగాయి. వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పశువులు సైతం నీటి ప్రవాహనాకి కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా చాలా మంది నీటిలో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. రత్నగిరిలో కుంభవృష్టి వర్షం కురిసింది. కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. వందలాది మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతోప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నాసిక్‌లో కొండచరియలు విరిగి పడటంతో రైల్వే ట్రాక్‌లు సైతం ధ్వంసం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోలు కూడా నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.