Karnataka Home Minister on Police: జంతు స్మగ్లర్ల నుంచి పోలీసులు లంచం తీసుకుంటూ స్వేచ్ఛగా అక్రమ రవాణాకు అనుమతిస్తున్నారని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర పోలీసులపై మండిపడ్డారు. వైరల్ అయిన ఒక వీడియో క్లిప్‌లో, దొంగతనం, పశువులను, ముఖ్యంగా ఆవుల అక్రమ రవాణాను ఆపడంలో విఫలమైనందుకు జ్ఞానేంద్ర ఒక పోలీసు అధికారిపై ఫోన్‌లో గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను కుక్కల్లా పోలుస్తూ.. లంచం తీసుకుని కుక్కల్లా నిద్ర పోతారని విరుచుకుపడ్డారు. ఇందుకు సంబంధించి ఈ వీడియో వైరల్ కావడంతో రచ్చ మొదలైంది.
కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర వీడియో ఫుటేజీ బయటకు రావడంతో వివాదం రాజుకుంది. ఆ వీడియోలో, “పశువులను రవాణా చేసే నేరస్తులు ఎవరో, మీ అధికారులకు తెలుసు, అయినప్పటికీ వారు లంచాలు తీసుకుంటారు కుక్కల్లా నిద్రపోతున్నారు. మీ పోలీసులకు ఆత్మగౌరవం లేదు” అని మంత్రి.. ఓ పోలీసు అధికారిపై విరుచుకుపడ్డారు.
ఈ వీడియోలో, జ్ఞానేంద్ర ఇంకా మాట్లాడుతూ, “నేను ఇప్పటివరకు ఏమీ చెప్పలేదు, కానీ నేను హోంమంత్రిగా కొనసాగాలా వద్దా?” చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాల్లో పశువుల అక్రమ రవాణా జరుగుతోందని పేర్కొన్నారు. ఈరోజు పోలీసు యంత్రాంగం మొత్తం కుళ్లిపోయిందని.. జీతం ఇస్తున్నామని, కానీ ఎవరూ జీతంతో బతకాలని కోరుకోవడం లేదని, లంచం తీసుకుని బాగా సంపాదిస్తున్నారని జ్ఞానేంద్ర అన్నట్లు వీడియోలో ఉంది.
Karnataka Home minister call cops Dogs.
In a video that is now viral he says
“The ones who illegally transport cows are habitual offenders, the cops know about this but they take bribes & sit idle like dogs”. : Araga Jnanedra pic.twitter.com/9irdhBpABf— Deepak Bopanna (@dpkBopanna) December 3, 2021
అయితే, తాను అలా మాట్లాడింది అందరు పోలీసు అధికారులను ఉద్ధేశించి కాదని, పోలీసులలోని ఒక వర్గానికి చెందిన వారిని మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. శివమొగ్గ జిల్లా తీర్థల్లి తాలూకాలోని తన గ్రామంలో జంతు స్మగ్లర్లు ఇద్దరు జంతు హక్కుల కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా వాహనంతో వారిపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారని ఆయన చెప్పారు. జంతువుల హక్కుల కార్యకర్తల పరిస్థితి చాలా విషమంగా ఉంది. అతనిని బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్చామన్నారు. ఈ ఘటన చాలా బాధ కలిగించిందని. ఇది అమానుష చర్య. రాష్ట్రంలో గోవధ నిషేధం కొత్త చట్టంతో పకడ్బందీగా అమలు చేస్తున్నప్పటికీ కొందరు పోలీసులు పశువుల స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని హోం మంత్రి ఆరోపించారు.
కర్ణాటక ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ కాటిల్ యాక్ట్, 2020 రాష్ట్రంలో గత సంవత్సరం ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి నుండి అమలులోకి వచ్చింది.ఈ చట్టం ప్రకారం, పశువులను వధిస్తే మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 50 వేల రూ. 5 లక్షల వరకు జరిమానా. తదుపరి నేరాలకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష. రూ. లక్ష నుంచి రూ. 10 లక్షలు వరకు జరిమానా విధించేలా కర్ణాటక సర్కార్ చట్టం తీసుకువచ్చింది. ఇటీవల, గో జ్ఞాన్ ఫౌండేషన్ సభ్యులు అనేక మంది జంతు హక్కుల కార్యకర్తలు బెంగళూరుతో సహా కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో స్మగ్లర్లు, కబేళాల యజమానుల దాడికి తెగబడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు నిందితులకు వ్యతిరేకంగా వ్యవహరించడం లేదని, వారిని స్వేచ్ఛగా వదిలేస్తున్నారని ఎన్జీవో సభ్యులు ఆరోపించారు.