
కర్నాటక రాష్ట్రంలో కల్లోలం సృష్టిస్తున్న అంశం ఇది. ఒక రకంగా చెప్పాంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్టుతో.. ఇప్పుడక్కడ ఒక నిశ్శబ్ధ తుఫాన్ విలయమే నడుస్తోంది.
NACO రిలీజ్ చేసిన ఆ భయానక గణాంకాలు అలా ఉన్నాయ్ మరి. హెచ్‌ఐవీ బాధితులు సరే…అందులో కాలేజీలకు వెళ్లే యువతీయువకులు భారీగా ఉండటం కలకలం రేపుతోంది.
కర్నాటక రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న హైఐవీ రోగుల సంఖ్య 2లక్షల 60వేలు. అధికారికంగా నమోదైన ఈ గణాంకాలు.. చిన్న సంఖ్యేమీ కాదు. అయితే, ఈ 2లక్షల 60వేల మందిలో చికిత్స పొందుతున్నది మాత్రం 2.05లక్షల మంది మాత్రమే. ఇది మరింత కలవరపెడుతున్న అంశం. మిగితావారు ఎవరనేది ఇంకా రిజిస్టర్‌లో నమోదు కాలేదు.
ఇక కర్నాటక రాష్ట్రంలో హైఐవీ సోకినప్పటికీ.. ఆ విషయమే తెలియని వారు 54వేల మంది ఉన్నారట. ఇది మరీ భయానకమైన అంశం. తెలిసీ తెలియక.. వారి ద్వారా ఈ వైరస్ ఎంత మందికి సోకుతుందోనన్నది మరో ఆందోళన కర్నాటక రాష్ట్రంలో మొత్తం HIV బాధితుల్లో.. 7వేల మందికిపైగా విద్యార్థులే ఉండటం… సంచలనంగా మారింది. వీరంతా వివిధ కాలేజీల్లో, క్యాంపస్‌లలో చదువుకుంటున్నవారే కావడం… అటు ప్రభుత్వాన్ని, ఇటు తల్లిదండ్రులకు కలవరపాటుకు గురిచేస్తోంది. విద్యార్థులు… అందులో 18-35మధ్య వయసుకున్నవారికి ఈ హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా సోకుతోందనే వార్త.. కర్నాటక రాష్ట్రంలో కల్లోలం సృష్టిస్తోంది. గత రికార్డులు పరిశీలిస్తే… దేశవ్యాప్తంగా 2023-24మధ్య ఈ వయసు HIV బాధితుల సంఖ్య 44వేల 500గా ఉంది. అయితే, ప్రస్తుత రికార్డుల ప్రకారం… 2025-26 నాటికి.. HIV బారిన పడ్డ యువతీ యువకుల సంఖ్య 66వేలకు పెరగడం కలవరపెడుతోంది.
NACO ఇచ్చిన ఈ సంచలన నివేదికతో రంగంలోకి దిగిన కర్నాటక ప్రభుత్వం.. కాలేజీల్లో మెగా క్యాంపులు నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఎయిడ్స్ నివారణ సంస్థ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో హెచ్ఐవి అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని నిర్ణయించింది. ప్రతీ కాలేజీలో HIV పరీక్షలు తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని కాలేజీల్లో హెచ్ఐవి టెస్టింగ్‌తో పాటు కౌన్సెలింగ్ క్యాంపులను నిర్వహించాలని ఆదేశించింది ప్రభుత్వం. అయితే ఈ టెస్టులకు సంబంధించి ఎలాంటి బలవంతం లేదు. క్యాంపులు తప్పనిసరి చేసినప్పటికీ, ఆయా విద్యార్థులు, వ్యక్తుల పూర్తి అంగీకారం లేకుండా ఎలాంటి స్క్రీనింగ్ చేయకూడదని కర్నాటక సర్కార్ స్పష్టం చేసింది. ఒకవేళ పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ… వారి గుర్తింపు గోప్యంగా ఉంచాలని నిర్ణయించింది.
ఇదే అంశంలో క్యూఆర్ కోడ్ విప్లవం కూడా తెరమీదకు వచ్చింది. HIVపై అవగాహన పెంచడానికి విద్యార్థుల కోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లను అందుబాటులోకి తెచ్చారు. దీన్ని స్కాన్ చేయడం ద్వారా హెచ్ఐవి కేంద్రాల వివరాలు, సరైన సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.
దేశానికి భవిత యువతే కాబట్టి… వారిని సంరక్షించుకోవడమే లక్ష్యంగా కర్నాటక ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సరైన అవగాహన లేకపోవడం వల్ల HIV లాంటి మహమ్మారి… విద్యార్థుల జీవితాలను చీకట్లోకి నెడుతున్న వేళ… ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతీ కాలేజీలో, ప్రతీ క్యాంపస్‌లో కౌన్సెలింగ్, టెస్టింగ్‌లు నిర్వహిస్తోంది. కుర్రకారును ఈ మహమ్మారి కబలించకుండా ఉండేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.