
ఓ వైపు దేశం మొత్తం వియానక చవితి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతుంటే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా తాజాగా కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలోని రెండు వెర్వేరు ప్రాంతాల్లో వినాయక నిమజ్జనం సందర్భంగా ఇద్దరు వ్యక్తులు గుండెపోటుతో మరణించారు. మండ్య జిల్లా కె.ఆర్.పేట తాలూకాలోని జోట్టనపుర గ్రామానికి చెందిన మంజునాథ్ అనే భక్తులు వినాయక నిమజ్జనం ఊరేగింపులో డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తరలించినా ఎలాంటి లాభం లేకపోయింది.
ఇదిలా ఉండగా చిక్కబళ్లాపూర్ జిల్లాలోనే ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. శిడ్లఘట్ట తాలూకా బోడగురు గ్రామంలో చెందిన లక్ష్మిపతి అనే వ్యక్తి గణేష్ నిమజ్జన వేడుకలో నాగవల్లి పాటకు నృత్యం చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. గ్రామస్తులు అతన్ని వెంటనే హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు వెల్లడించారు.
ఈ రెండు ప్రాంతాల్లో గుండెపోటు కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే.. మైసూర్ జిల్లాలోని హున్సూర్ తాలూకాలో గణేష్ నిమజ్జనాల సందర్భంగా ట్రాక్టర్‌పై నుంచి పడి ఓ వ్యక్తి మరణించాడు. గ్రామంలో గణేష్ నిమజ్జనం కోసం ట్రాక్టర్‌లో ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఇంతలో, రాజు తన ఇంటి దగ్గరకు వచ్చిన గణేశుడిని దర్శించుకునేందుకు ట్రాక్టర్‌పైకి ఎక్కాడు. వినాయకుడికి మొక్కే క్రమంలో అకస్మాత్తుగా ట్రాక్టర్‌పై నుంచి కింద పడిపోయాడు. దీంతో రాజు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు, కానీ మార్గమధ్యలో అతను తుది శ్వాస విడిచాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.