
భజరంగ్ దళ్ కార్యకర్తలు కర్ణాటకలో అర్థరాత్రి హంగామా సృష్టించారు. శివమొగ్గలోని ఒక ప్రైవేట్ హోటల్ నిర్వహించిన లేడీస్ పార్టీని బలవంతంగా అడ్డుకున్నారు. పలువురు మహిళలను అక్కడి నుంచి బయటకు తరిమేశారు. ఈ కార్యక్రమం హిందూ వ్యతిరేకమని ఆరోపిస్తూ పోలీసులతో పాటు భజరంగ్ దళ్ కార్యకర్తలు హోటల్‌లోకి ప్రవేశించారు.
శివమొగ్గలోని క్లిఫ్ ఎంబసీ హోటల్‌పై భజరంగ్ దళ్ సభ్యులు దాడి చేసి హోటల్‌లో కొనసాగుతున్న ప్రైవేట్ పార్టీని అడ్డుకున్నారు. అయితే ఈ పార్టీలో దాదాపు 70 మంది అమ్మాయిలు పాల్గొన్నట్లు సమాచారం. అక్కడి నుండి అమ్మాయిలను వెళ్లిపోవాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. అమ్మాయిల అర్థరాత్రి పార్టీ గురించి తమకు సమాచారం అందిందని వెంటనే పోలీసులకు సమాచారమిచ్చామని, వారు జోక్యం చేసుకుని పార్టీని అడ్డుకున్నారని భజరంగ్‌దళ్ నాయకుడు రాజేష్‌గౌడ తెలిపారు. మహిళలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం హిందూ సంస్కృతికి విరుద్ధమని గౌడ అన్నారు. శివమొగ్గలో ఇటువంటి సంఘటనలను భజరంగ్ దళ్ సహించదని ఆయన హెచ్చరించారు. అంతేకాదు పార్టీలో మహిళల వస్త్రధారణ అభ్యంతరకరంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. తాము చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేదని, బదులుగా పోలీసులకు సమాచారం అందించామన్నారు.
అయితే, తాము పార్టీని అడ్డుకోలేదని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మాత్రమే తాము జోక్యం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. పార్టీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమకు సమాచారం అందిన వెంటనే పోలీసులను సంఘటనా స్థలానికి పంపించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేశామని శివమొగ్గ పోలీస్ సూపరింటెండెంట్ జికె మిథున్ కుమార్ తెలిపారు.
అయితే, పోలీసులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఇద్దరూ పార్టీ హాల్లోకి ప్రవేశించి తమ కస్టమర్లను భయభ్రాంతులకు గురి చేశారని హోటల్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. మహిళా కస్టమర్ల కోసం పార్టీ ఏర్పాటు చేశామని, అభ్యంతరకరం ఏమీ లేదని హోటల్ ప్రతినిధులు తెలిపారు. ఈ హోటల్‌కు మంచి పేరు ఉందని, ఇటీవల PM మోడీ శివమొగ్గ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బందితో సహా VIPలకు కూడా ఆతిథ్యం ఇచ్చినట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.