ఓ వైపు కేరళను మృత్యు ఘోష వెంటాడుతోంది. మరో వైపు కర్కిడక వావు దినాన్ని పురస్కరించుకుని కేరళీయులు భారీ సంఖ్యలో కాలం చేసిన తమ పెద్దలకు తర్పణాలను అర్పించడానికి రెడీ అవుతున్నారు. బలి తర్పణం రోజున తమ పూర్వీకులకు తర్పణం అర్పిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్మకం. దీంతో బలితర్పణం అర్పించడానికి నదులు, సముద్ర తీరాలు, ఆలయాల వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటారు. మరణించిన తమ పెద్దల పేరుతో పిండ ప్రదానం చేస్తారు. అయితే వయనాడ్ ఘటనతో కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బలితర్పణం కార్యక్రమం నేపథ్యంలో.. భక్తుల భద్రతపై నివేదిక కోరింది కేరళ హైకోర్టు.
భీకర వర్షాలు కేరళలో విరుచుకుపడడంతో వయనాడ్‌లో ప్రకృతి విలయం సంభవించింది. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో గంటగంటకు మృతులు సంఖ్య పెరుగుతోంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడతాయంటూ కేంద్రం హెచ్చరించిన కేరళ ప్రభుత్వం పట్టించుకోలేందంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఆరోపించింది. వయనాడ్ ఘటనలతో కేరళ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు శబరిమలతో పాటు ముఖ్య ఆలయాల్లో.. ప్రభుత్వం తీసుకున్న భద్రతపై ప్రశ్నించింది. ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రతపై నివేదిక ఇవ్వాలని పినరయ్ విజయన్ సర్కార్‌ని కేరళ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో ప్రముఖ టెంపుల్స్ లో భద్రతపై వెనువెంటనే నివేదిక ఇవ్వాలని ఆలయాల బోర్డులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేరళలో 3, 4, 5 తేదీల్లో బలితర్పణం కార్యక్రమం జరగనుంది. దీంతో కేరళలోని ఆలయాలకు పోటెత్తనున్నారు భక్తులు.
కేరళలో ఈమూడు రోజుల పాటు పూర్వీకులకు వేలాది మంది బలి తర్పణం సమర్పిస్తారు. కర్కిడక వావు వార్షిక కార్యక్రమం సందర్భంగా చనిపోయిన పూర్వీకులకు ‘బలి తర్పణం నైవేద్యాన్ని వివిధ దేవాలయాలు, మతపరమైన ప్రదేశాలకు వెళ్లి సమర్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ప్రదేశాలతో పాటు నదీ తీరాలు, సముద్ర తీరాల్లో బలి తర్పణం పూజలు చేస్తారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.
కర్కిడక అనేది మలయాళ పంచాంగంలో చివరి మాసం. వావు అంటే అమావాస్య రోజు. ఏటా ఇదే రోజున బలితర్పణం జరుగుతుంది.
కోవిడ్ సమయంలో ఆగిపోయిన బలి తర్పణం తర్వాత నుంచి మళ్లీ ఆచరిస్తున్నారు. రాష్ట్రంలో భారీగా వర్షాలు.. కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో బలితర్పణం కార్యక్రమానికి ఆలయాలు తీసుకున్న జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని కోరింది హైకోర్టు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..