#KanikaKapoor బ్రిటన్‌లో పర్యటించి కరోనా వైరస్‌ను మోసుకొచ్చిన ప్రముఖ సింగర్ కనికా కపూర్ వ్యవహారం ఇపుడు దేశంలో హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా పార్లమెంటులో కలకలం రేపుతోంది. ఎంపీలతోపాటు చాలా మంది ప్రముఖులు ఇపుడు కంగారు పడే పరిస్థితి తీసుకొచ్చింది సింగర్ కనికా కపూర్. ఎంపీలే కాకుండా.. పార్లమెంటు అధికారులు సైతం ఇపుడు కనికా కపూర్ పేరు వింటేనే కలవరపడిపోతున్నారు. ఎందుకంటే…
శుక్రవారం బయట పడిన కరోనా పాజిటివ్ కేసుల్లో ప్రముఖ సింగర్ కనికా కపూర్ కూడా వున్నారన్న వార్త పార్లమెంటులో పలువురిని శుక్రవారం కంగారు పెట్టించింది. గత ఆదివారం బ్రిటన్ నుంచి తిరిగొచ్చిన కనికా.. ఆ తర్వాత పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైన డిన్నర్లకు అటెండయ్యారు. వారితో సన్నిహితంగా వున్న ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. తాను బ్రిటన్ నుంచి వచ్చిన విషయాన్ని కనికా సీక్రెట్‌గా వుంచడం వల్లనే వారంతా ఫ్రీగా ఆమెతో మూవ్ అయినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో ఆమె ఓ స్టార్ హోటల్‌లో ఉంటూ ఓ విందుకు హాజరయ్యారు. ఆ విందులో దాదాపు 100 మంది పాల్గొన్నట్లు సమాచారం. దీంతో కనికా ఎక్కడెక్కడ తిరిగారు..? ఆమె పాల్గొన్న విందులో ఎవరెవరు పాల్గొన్నారు అనే వివరాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పార్లమెంట్ సభ్యులు, సిని, రాజకీయ ప్రముఖులు ఈ డిన్నర్‌కు హాజరయ్యారు. బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, బీజేపీ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సింధియా కూడా ఈ విందుకు హాజరయ్యారు.
విందుకు హాజరైన తర్వాత ఎంపీ దుష్యంత్ సింగ్ తిరిగి పార్లమెంటుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులను ఆయన కలుసుకున్నారు. పార్లమెంటు సిబ్బందితో కూడా ఇంటరాక్ట్ అయ్యారు. అయితే.. కనికా కపూర్‌కు శుక్రవారం ఉదయం కోవిడ్-19 పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దాంతో దుష్యంత్ సింగ్‌తో పాటు ఆయనను కలుసుకున్న పలువురు ఎంపీల్లో కంగారు మొదలైంది. అదే సమయంలో కనికాకు పాజిటివ్ రాగానే.. ఆమె కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టారు అధికారులు.
ఈ నేపథ్యంలో కనికా ద్వారా దుష్యంత్.. ఆ తర్వాత ఆయన ద్వారా మరికొందరు ఎంపీలకు కరోనా సోకిందేమో అన్న ఆందోళన పెరిగిపోతోంది. కనికాతో సన్నిహితంగా వున్న వారి ఆ తర్వాత ఎంత మందిని కలుసుకున్నారనేది ఇపుడు పెద్ద చర్చనీయాంశం. అయితే దుష్యంత్ తాను కనికా కపూర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చానని అంగీకరించడంతో ఆయన్ను ఆయన స్వగృహంలో క్యారంటైన్ చేశారు అధికారులు. అదే సమయంలో దుష్యంత్ సింగ్ తల్లి, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె సింధియా కూడా హోం క్యారెంటైన్ అయ్యారు.
While in Lucknow, I attended a dinner with my son Dushyant & his in-laws. Kanika, who has unfortunately tested positive for #Covid19 was also a guest.
As a matter of abundant caution, my son & I have immediately self-quarantined and we’re taking all necessary precautions.
— Vasundhara Raje (@VasundharaBJP) March 20, 2020
సుమారు వంద మంది వరకు కనికా హాజరైన విందుకు హాజరయ్యారని, వారంతా ఆ తర్వాత రోజుల్లో ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఎవరిని కలుసుకున్నారు? వారి ఇంట్లో ఎవరితో వున్నారనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. మొత్తానికి కనికా తన విదేశీ పర్యటనను దాచిపెట్టి విందుకు హాజరవడం దేశంలో కలకలం రేపుతోంది. ఎందరికి కరోనా పాజిటివ్ వస్తుందో అన్న భయాందోళన పెరిగిపోతోంది. అయితే.. కనికా కపూర్ తాను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్లో దిగిన తర్వాత వైద్య బృందం పరీక్షలు నిర్వహించిందని, తనకు కోవిడ్ సోకలేదన్న నమ్మకం వుండడం వల్లనే అందరితో కలిసి మెలిసి వున్నానని చెబుతున్నారు.