మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ప్రభుత్వానికి ‘కరోనా’ భయం పట్టుకున్నట్టు కనిపిస్తోంది. సోమవారం శాసన సభలో ఆయన సర్కార్ బలపరీక్షను ఎదుర్కొవాలంటూ గవర్నర్ రాసిన లేఖ శనివారం అర్ధరాత్రి అందడంతో మధ్యప్రదేశ్ మంత్రివర్గం ఆదివారం కమల్ నాథ్ అధ్యక్షతన సమావేశమైంది. ఫ్లోర్ టెస్ట్ పై తుది నిర్ణయాన్ని తీసుకునే అధికారాన్ని కేబినెట్ ఆయనకే అప్పగించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రేపే అసెంబ్లీలో బల పరీక్ష జరగాల్సిన అవసరం లేదని ప్రదీప్ జైస్వాల్ అనే మంత్రి వ్యాఖ్యానించారు. (రేపు శాసన సభలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని స్పీకర్ ప్రజాపతిని ఆదేశిస్తూ గవర్నర్ లాల్ జీ టాండన్ లేఖ రాశారు). కాగా-తమకు తగినంత మంది ఎమ్మెల్యేల బలం ఉందని ముఖ్యమంత్రి ఎంతో నమ్మకంగా ఉన్నారని ప్రదీప్ జైస్వాల్ తెలిపారు. ‘వేచి చూడండి’ అని మీడియాతో అన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం కొందరు మంత్రులు మాట్లాడుతూ.. బెంగుళూరులోని రెబెల్ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని, వారి కుటుంబాలను కలుసుకునేందుకు కూడా వారిని అనుమతించడంలేదని ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేల సెల్ ఫోన్లను లాక్కున్నారని వారు దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల నిర్బంధాన్ని సవాలు చేస్తూ తాము సుప్రీంకోర్టుకెక్కుతామని అన్నారు.
ఇలాఉండగా.. కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా.. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో సమావేశమయ్యారు. గతవారం రాజీమానామా చేసిన 22 మంది రెబెల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన పక్షంలో న్యాయపరంగా తీసుకోవలసిన చర్యలపై ఆయనతో వారు చర్చించారు.