Jharkhand Police: హర్యానాలో డీఎస్పీ దారుణహత్య మరువక ముందే జార్ఖండ్ రాజధాని రాంచీలో మరో ఘోరం జరిగింది. డీఎస్పీ హత్య లాగే.. దుండగులు ఓ మహిళా ఎస్సైని కూడా వాహనంతో తొక్కించి హతమార్చారు. రాంచీలోని టుపుదానా ఔట్‌పోస్ట్ ఇంఛార్జ్‌గా సబ్ ఇన్‌స్పెక్టర్ సంధ్య టోప్నే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రోజులాగే వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో వాహనంతో వేగంగా దూసుకొచ్చిన డ్రైవర్ ఎస్సైని ఢీకొట్టాడు. పశువులను తరలిస్తున్నారని ఎస్సైకి సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్నారు. వాహనాన్ని అడ్డుకునేందుకు ఆమె ప్రయత్నించారు. దాంతో డ్రైవర్ ఎస్సైని ఢీకొట్టాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద‍్యులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి వాహనాన్ని సీజ్ చేశారు. కాగా.. హర్యానాలోని నూహ్‌లో అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన ఓ డీఎస్పీ ర్యాంక్ అధికారిని మైనింగ్ మాఫియా హత‍్య చేసిన కొన్ని గంటల్లోనే మహిళా ఎస్సై హత్య జరగటం కలకలం సృష్టించింది. డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ హత్య కేసులో ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిందితుడు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
ఇదిలాఉంటే.. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో కూడా ఓ పోలీసు కానిస్టేబుల్‌ను దుండగులు ట్రక్కుతో ఢీకొట్టి చంపారు. నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న రాజ్‌కిరణ్ అనే పోలీసు కానిస్టేబుల్‌ను ట్రక్కుతో ఢీకొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. రాజ్‌కిరణ్ ట్రక్కును ఆపడానికి ప్రయత్నించగా, నిందితులు పోలీసును ఢీకొట్టి, వాహనాన్ని వదిలి అక్కడి నుంచి పారిపోయారు. రాజ్‌కిరణ్‌ను కరంసాద్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆనంద్ ఎస్పీ అజిత్ రాజియన్ పేర్కొన్నారు. కాగా.. గత 24 గంటల్లో వరుసగా.. మూడు ఘటనలు జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..