Jharkhand: వేగంగా మారుతున్న జార్ఖండ్ రాజకీయాలు.. రాంచీ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు ఎమ్మెల్యేలు

|

Feb 02, 2024 | 6:47 PM

జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 'టైగర్ ఆఫ్ జార్ఖండ్'గా ప్రసిద్ధి చెందిన చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. శిబు సోరెన్‌ ఆశీర్వాదం తీసుకున్న అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకున్న ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సాయంత్రమే చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమైంది.

Jharkhand: వేగంగా మారుతున్న జార్ఖండ్ రాజకీయాలు.. రాంచీ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు ఎమ్మెల్యేలు
Champai Soren
Follow us on

జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ‘టైగర్ ఆఫ్ జార్ఖండ్’గా ప్రసిద్ధి చెందిన చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. శిబు సోరెన్‌ ఆశీర్వాదం తీసుకున్న అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకున్న ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సాయంత్రమే చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమైంది. పలువురు ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి గవర్నర్‌ను కలిశారు. దీని తరువాత, జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధా కృష్ణన్ చంపాయ్ సోరెన్‌ను ముఖ్యమంత్రి పదవికి నామినేట్ చేసి, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. హేమంత్ సోరెన్ అరెస్ట్, రాజీనామా కారణంగా జార్ఖండ్ సీఎం పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే..! జార్ఖండ్‌లో మంత్రిగా ఆర్జేడీ నేత ససత్యానంద భోక్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఛత్ర స్థానం నుంచి గెలుపొందిన ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు మంత్రి అయ్యారు. కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అతను పాకూర్ స్థానం నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు.

కొత్త ప్రభుత్వ కొలువుదీరిన 10 రోజుల్లోగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్‌ను గవర్నర్‌ ఆదేశించారు. దీంతో 81 మంది ఎమ్మెల్యేలు ఉన్న జార్ఖండ్‌ శాసనసభలో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి 48 మంది సభ్యుల బలం ఉంది. బలపరీక్ష నేపథ్యంలో సంకీర్ణ కూటమి తమ సభ్యులను కాపాడుకునేందుకు సిద్ధమైంది. కొంతమంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు కోసం హైదరాబాద్ సిటీలో మూడు హోటల్స్‌ను బుక్ చేసింది కాంగ్రెస్ పార్టీ. షామీర్ పేట్‌లోని లియోనియా, బంజారాహిల్స్ తాజ్ కృష్ణ, గచ్చిబౌలి ఎలా హోటల్స్‌ను సిద్ధం చేశారు.

జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం తర్వాత 39 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు బయలుదేరారు. JMM, కాంగ్రెస్, RJD ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చాలా మంది ఎమ్మెల్యేలు బస్సులో విమానాశ్రయానికి చేరుకున్నారు. ఫిబ్రవరి 5న చంపాయ్ సోరెన్ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోనున్నారు. అదే రోజున హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేలను రాంచీకి పిలిపించుకోవచ్చని తెలుస్తోంది. బస్సులో హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్ కూడా ఉన్నాడు.

గత రెండు రోజులుగా జార్ఖండ్‌ రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. జనవరి 31న హేమంత్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు. ఆ వెంటనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడం.. కొత్త ముఖ్యమంత్రిగా చంపయీని ఎన్నుకోవడం, ఆ తర్వాత హేమంత్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేయడం చకాచకా జరిగిపోయాయి.

మరోవైపు శుక్రవారం తెల్లవారుజామున హేమంత్ సోరెన్ కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందుగా హైకోర్టుకు వెళ్లి ఉండాల్సిందని హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టు తెలిపింది. ఇది కాకుండా అందరి చూపు జార్ఖండ్‌లోని పీఎంఎల్‌ఏ కోర్టుపైనే ఉంది. హేమంత్ సోరెన్ రిమాండ్‌పై పీఎంఎల్‌ఏ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…