ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ.. కారణం ఇదేనా?

శ్రీహరికోటలోని సతీష్ దవన్ స్పేస్ సెంటర్ షార్‌ నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన PSLV-C62 రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. అన్వేష సహా 15 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లిన PSLV-C62 రాకెట్‌ మూడు దశలను విజయవంతంగా కంప్లీట్ చేసుకొని నాలుగో దశలోకి చేరుకున్న తర్వాత సాంకేతిక సమస్య కారణంగా ఆచూకీ కోల్పోయింది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్‌ వి.నారాయణన్‌ వెల్లడించారు. ఈ వైఫల్యానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని ఆయన తెలిపారు.

ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ.. కారణం ఇదేనా?
Isro Pslv C62 Failure (1)

Edited By:

Updated on: Jan 12, 2026 | 1:11 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పటి వరకు 101 ప్రయోగాలను చేపట్టింది. ఇస్రో ప్రయోగిస్తున్న రాకెట్లలో అనేక రకాలు ఉన్నాయి. భూమి నుంచి అంతరిక్షంలోకి అవి ప్రయాణించే దూరం, కక్ష్యలోకి తీసుకెళ్లే ఉపగ్రహాల బరువును బట్టి ఆయా రాకెట్ల ప్రయోగాన్ని ఇస్రో చేపడుతుంది. అందులో PSLV, GSLV, మార్క్ 3, LVM , SSLV తరహా రాకెట్లను ఇస్రో ప్రయోగిస్తూ ఉంటుంది. అయితే PSLV సీరిస్‌లో ఇప్పటివరకు 64 రాకెట్లను ఇస్రో ఉపయోగించగా వాటిలో కేవలం రెండు మాత్రమే విఫలమయ్యాయి. తాజాగా సోమవారం జరిగిన విఫల ప్రయోగంతో అది మూడుకు చేరింది.

భారతదేశం అంతరిక్ష పరిశోధన కోసం ఒకప్పుడు రష్యా ఫ్రెంచ్ గయా లాంటి దేశాలపై ఆధారపడేది. మన దేశ అవసరాల కోసం అవసరమైన ఉపగ్రహాలను ఇతర దేశాల నుంచి ప్రయోగించేది. అలాంటిది 1970లో భారత్ సొంతంగా అంతరిక్ష పరిశోధన సంస్థను ఏర్పాటు చేసి పనులు పూర్తయిన తర్వాత 1975లో తొలి ప్రయోగం జరిగింది. ప్రారంభ దశలో అనేక వైఫల్యాలను చూసిన ఇస్రో ఆ తర్వాత అంచలంచలుగా సక్సెస్ రేట్ ను పెంచుకుంటూ వచ్చింది.. తొలినాలలో SLV, ASLV రాకెట్లను రూపొందించి ప్రయోగాలు చేపట్టేది.. అందులో సక్సెస్ రేట్ అంతంతమాత్రంగా ఉండేది. ఆ తర్వాత పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(PSLV) తయారుచేసి విఫలం అన్నది లేకుండా ప్రతి ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టడం మొదలు పెట్టింది.

ఇస్రో చేపట్టే ప్రయోగాలలో 100% సక్సెస్ గ్యారంటీ అన్న పేరు PSLV లాంచ్ వెహికల్‌కు ఉండేది.. అలాంటి పిఎస్ఎల్వి ఇటీవల వరుస వైఫల్యాలను ఎదుర్కొంటుంది. గతంలో GSLV ప్రయోగం సక్సెస్ రేట్ అనుమానంగా ఉన్న సందర్భంలో చంద్రయాన్ లాంటి కీలక ప్రయోగాన్ని కూడా PSLV ద్వారానే ఇస్రో చేపట్టి సక్సెస్ కొట్టింది. నవంబర్లో చేపట్టిన PSLV ప్రయోగం కూడా విఫలం కాగా తాజాగా సోమవారం జరిగిన PSLV C62 ప్రయోగం చివరి దశలో విఫలమైంది.

సోమవారం ఇస్రో ప్రయోగించిన PSLV C62 రాకెట్ ప్రయోగం విఫలం కావడం ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆందోళన పెంచింది. రాకెట్ ప్రయోగం జరిగిన 9 నిమిషాల తరువాత మూడు దశలు పూర్తి చేసుకున్న రాకెట్ నాలుగవ దశకు చేరుకుని సాంకేతిక లోపం కారణంగా ఆచూకీ మిస్సైంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలకు PSLV C62 ప్రయాణం తెలియలేదు.. శాటిలైట్ కమ్యూనికేషన్స్ కట్ ఆఫ్ అయింది. ఇంతలో మీడియా ముందుకు వచ్చిన ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్.. మొదటి మూడు దశలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న రాకెట్‌ నాలుగో దశలో సాంకేతిక లోపం కారణంగా ఆచూకీ కోల్పోయిందని వివరించారు. దీంతో ప్రయోగం విఫలమైందని స్పష్టం చేశారు.

అయితే ఈ ప్రయోగం విఫలం అవ్వడానికి గల కారణాలను ఇస్రో శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. వైఫల్యానికి బంధించిన పూర్తి సమాచారం తిరిగి తెలియ జేస్తామని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. సక్సెస్ గ్యారంటీ అన్న పేరున్న PSLV మూడో ఫెయిల్యూర్ శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. భవిష్యత్తులో గగన్యాన్ లాంటి కీలక ప్రయోగాలను చేపట్టనున్న నేపథ్యంలో ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తితే భారీ ప్రాజెక్టుల విజయంపై ప్రభావం పడే అవకాశం ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇస్రో ఇలాంటి సమస్యలను ఎలా అధిగమిస్తుందో చూడాలి మరి.

మరిన్ని సైన్స్‌ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.