
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మిషన్ కోసం చేస్తున్న పరీక్షలో మరో ముందడుగు పడింది. మానవ అంతరిక్ష యాత్రలో వ్యోమగాముల భూమికి సురక్షితంగా తిరిగి రావడం కోసం రూపొందించిన పారాచూట్ వ్యవస్థ పనితీరును పరీక్షించేందుకు చేపట్టిన “ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (IADT-01)”ను విజయవంతంగా నిర్వహించింది. ఈ విషయాన్ని ఇస్రో తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేసింది. ఈ ప్రయోగం గగన్‌యాన్ మిషన్ విజయానికి ఎంతో ముఖ్యమైందిగా ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
వ్యోమగాములు అంతరిక్షం నుంచి భూమి మీదకు తిరిగి వచ్చే క్రమంలో వారి మాడ్యూల్‌ను వేగాన్ని నియంత్రించి.. దాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు ఈ పారాచూట్ వ్యవస్థను ఉపయోగిస్తారు. తాజాగా జరిగిన ఈ పరీక్ష సమయంలో, ఒక మాక్ మాడ్యూల్ ఒక విమానం నుండి విడుదలై, కొత్తగా అభివృద్ధి చేయబడిన పారాచూట్ అసెంబ్లీ మార్గదర్శకత్వంలో సురక్షితంగా దిగి, దాని పనితీరును విజయవంతంగా నిరూపించింది.
పారాచూట్ విస్తరణ క్రమం ఎండ్-టు-ఎండ్ పనితీరును అంచనా వేయడం, ఇందులో వెలికితీత, డ్రోగ్ చ్యూట్ యాక్టివేషన్, తరువాత ప్రధాన పారాచూట్ విస్తరణ, ల్యాండింగ్‌కు ముందు సజావుగా వేగాన్ని నిర్ధారించడం వంటి వాటిని తెలసుకోవడం కోసం ఇస్రో ఈ IADT-01 పరీక్షను నిర్వహించినట్టు తెలుస్తోంది.
గగన్‌యాన్ కార్యక్రమాని మద్దతుగా ఈ ప్రయోగంలో ఇస్రోతో పాటు దేశంలోని పలు ప్రముఖ రక్షణ, పరిశోధనా సంస్థలైన భారత వైమానిక దళం (IAF), డీఆర్‌డీఓ (DRDO), భారత నౌకాదళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ పరీక్షలో పాల్గొన్నాయి. ఈ సంస్థలన్నీ సమన్వయంతో కలిసి ప్రయోగాన్ని విజయవంతం చేశాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.