
Delhi: పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) మద్దతుతో దేశంలో ఉగ్ర కార్యకలాపాలు నడుపుతున్న టెర్రర్ నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అధికారులు ఛేదించారు. 9 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఈ నెట్‌వర్క్‌కు ముంబై అండర్‌వరల్డ్‌తో కూడా సంబంధాలు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. అరెస్టు అయినవారు వారు ఢిల్లీ, ముంబై సహా దేశంలోని ప్రధాన నగరాల్లోని కీలక సంస్థలు, భద్రతా సిబ్బంది మీద దాడులు చేయాలని ప్లాన్ చేశారు. వీరు పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్ల నుంచి ఆదేశాలు అందుకుని, దేశంలో భయాందోళన సృష్టించి భద్రతా వ్యవస్థను అస్థిరపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారని దర్యాప్తు అధికారులు తెలిపారు.
ఢిల్లీలో నిర్వహించిన స్పెషల్ సెల్ బృందం నిర్వహించిన కో-ఆర్డినేటెడ్ ఆపరేషన్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు,నగదును సీజ్ చేశారు. అధునాతన పిస్టల్స్, గ్రనేడ్లు ఇతర ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగపడే వస్తువులు లభ్యమయ్యాయి. ప్రాథమిక దర్యాప్తులో అరెస్టు అయిన వారు పాకిస్తాన్‌కు చెందిన ఆపరేటివ్స్‌తో సంప్రదింపులు జరిపినట్లు, వారి నుంచి సూచనలు అందుకున్నట్లు తెలిసింది. ఢిల్లీ, ముంబై, హర్యానా తదితర ప్రాంతాల్లోని వివిధ లక్ష్యాలపై రెక్కీ చేసినట్లు కూడా ఆధారాలు లభించాయి.
అరెస్టు అయినవారిలో ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్ తదితర రాష్ట్రాలకు చెందినవారని, కొందరు విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరి గుర్తింపు, జాతీయతలను పోలీసు అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఈ మాడ్యూల్ ముంబై అండర్‌వరల్డ్‌తో ముడిపడి ఉండవచ్చని, నేరపరమైన నెట్‌వర్క్‌ల ద్వారా లాజిస్టిక్స్, ఫండింగ్ ఆపరేటివ్స్ కదలికలకు ఉపయోగపడుతున్నట్లు భద్రతా ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం ఈ టెర్రర్ మాడ్యూల్ కి సంబంధించి ఆర్థిక లావాదేవీలు, కమ్యూనికేషన్ రికార్డులు, వీరికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ అరెస్టులు భారత్‌లో ఉగ్రవాద నిరోధక చర్యలపై జరుగుతున్న కఠిన చర్యల్లో భాగమని అధికారులు తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా బందోబస్తు మరింత బలోపేతం చేశారు. మరిన్ని వివరాలు విచారణ అనంతరం వెల్లడికావాల్సి ఉంది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది.
ఇది కూడా చదవండి: PAN Card: పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. జూన్ 1 నుంచి అమల్లోకి..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి