
బీజేపీ నేతృత్వంలో అమిత్ షా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన నాటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. రాజకీయ నాయకుల దగ్గర నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. ఢిల్లీతో పాటు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, త్రిపురల్లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. లౌకికవాదానికి, రాజ్యాంగ స్ఫూర్తికి ఈ చట్టం విరుద్ధమని.. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కల్పించే సమానత్వ హక్కును కూడా ఈ చట్టం ఉల్లంఘిస్తోందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఈ నేపథ్యంలో అసలు బీజేపీ పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టడానికి కారణాలు ఏంటి.? దీని వల్ల సామాన్యుడికి ఎటువంటి ఉపయోగం ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
పౌరసత్వ సవరణ చట్టం ఏం చెబుతోంది.?
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్.. వంటి ఇస్లామిక్ దేశాల నుంచి హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్దులు, జైనులు.. ఆయా దేశాల్లో మతపరమైన హింసకు గురయ్యి.. మన దేశానికి శరణార్థులుగా వచ్చిన పక్షంలో వారికి భారతీయ పౌరసత్వం కల్పించడానికి ఈ చట్టం ఉద్దేశిస్తోంది. అంతేకాక ఒకవేళ వారు అక్రమంగా మన దేశానికీ వచ్చినా.. వీరికి ఈ హోదాను కల్పించడం కోసమే ఈ చట్టాన్ని రూపొందించారు. గతంలో 11 ఏళ్లుగా భారత్‌లో శరణార్థులుగా ఉంటున్న వారికే భారత పౌరసత్వం ఇవ్వగా.. ఇప్పుడు దాన్ని కాస్తా ఐదేళ్లకు తగ్గించారు.
అసలు ఎందుకు ఈ చట్టం ఈశాన్య రాష్ట్రాల్లో ఇంత పెద్ద చిచ్చు రేపింది.?
సాధారణంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి ఇతర దేశాలు, ప్రాంతాల వారు శరణార్థులుగా ఈ రాష్ట్రాలకు వచ్చి చిన్నా, చితకా వ్యాపారాలో, పనులో చేసుకుంటూ స్థిరపడుతుంటారు. వీరి వల్లే ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు ఇబ్బంది తలెత్తుతోంది. వీరికి భారతీయ పౌరసత్వ చట్టం వర్తించదు. మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఇన్నర్ లైన్ పర్మిట్ అనే సిస్టంని పాటిస్తున్నాయి. పరాయి దేశాల నుంచి వచ్ఛే వారి ప్రవేశాన్ని ఈ సిస్టం రెగ్యులేట్ చేస్తోంది. అంటే వారికి పరిమిత కాలానికి మించి ఈ రాష్టాల్లో ఉండే హక్కులేదు. కానీ వారు గడువుకు మించి ‘ పాతుకుపోవడం ‘ ఈ స్టేట్స్‌కు తలనొప్పిగా మారుతోంది. అస్సాంలో ఇటీవల ఎన్ఆర్సీ ప్రభుత్వం చేపట్టిన చర్య ఇందుకు సంబంధించినదే. దీని వల్ల స్థానికులు, స్థానికేతరుల మధ్య వైరుధ్యాలు, విభేదాలు ఏర్పడుతుండటంతో కేంద్రం ఈ చర్య తీసుకుంది.
సామాన్యుడికి ఈ చట్టంతో ఒరిగేదేమిటి..?
పౌరసత్వ సవరణ చట్టం వల్ల సామాన్యుడికి ఒరిగేదేమి లేకపోగా.. వారికి ఉద్యోగాలు, తదితర ప్రయోజనాలకు ఇది అడ్డంకిగా ఉండటమే ఈ నిరసనలకు కారణమవుతోంది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు సైతం ఈ చట్టానికి నిరసనగా గళమెత్తుతున్నారు.
కేంద్రం చెబుతున్నది ఏమిటి.?
ఈ చట్టం ముస్లింల పట్ల వివక్ష చూపేలా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. పాకిస్థాన్, అప్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌లు ఇస్లామిక్ దేశాల కాబట్టి.. వారిని హింసకు గురవుతున్న మైనారిటీలుగా చూడలేమని కేంద్రం చెప్పుకొస్తోంది.
కాగా, ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ 60కి పైగా పీటీషన్లు సుప్రీం కోర్టులో దాఖలు అయ్యాయి. వీటిపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు తదుపరి విచారణ జనవరి 22న జరగాలని ఆదేశించింది.