ఆంధ్రా కేడర్ ఐపీఎస్‌కు.. జమ్మూకశ్మీర్‌లో కీలక పదవి.! అసలెవరీ నళిన్ ప్రభాత్.?

| Edited By: Ravi Kiran

Aug 15, 2024 | 3:21 PM

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న జమ్ము-కాశ్మీర్ రాష్ట్రానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP)గా 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. కేబినెట్ నియామకాల కమిటీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రా కేడర్ ఐపీఎస్‌కు.. జమ్మూకశ్మీర్‌లో కీలక పదవి.! అసలెవరీ నళిన్ ప్రభాత్.?
Nalin Prabhat
Follow us on

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న జమ్ము-కాశ్మీర్ రాష్ట్రానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP)గా 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. కేబినెట్ నియామకాల కమిటీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(NSG)కి అధిపతిగా పనిచేస్తున్న ఆయన్ని కేంద్ర ప్రభుత్వం ఏరికోరి జమ్ము-కాశ్మీర్ బాధ్యతలు అప్పగించింది. సీమాంతర ఉగ్రవాదుల దుశ్చర్యలతో సతమతమవుతున్న ఈ రాష్ట్రంలో అత్యంత సవాళ్లతో కూడిన ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది.

నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(NSG) ప్రముఖుల రక్షణ బాధ్యతలతో పాటు దేశంలో ఉగ్రవాద నిరోధక చర్యల్లో అత్యుత్తమ కమెండో ఫోర్స్‌గా ప్రఖ్యాతి చెందింది. ఆ బలగానికి అధిపతి (డైరెక్టర్ జనరల్)గా నళిన్ ప్రభాత్ ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2028 ఆగస్టు 31న పదవీ విరమణ చేసే వరకు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారంటూ పేర్కొంది. అయితే ఈ బలగంలో చేరిన కొద్ది నెలల్లోనే నళిన్ ప్రభాత్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి సెంట్రల్ సర్వీసెస్ నుంచి AGMUT(అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం, యూనియన్ టెర్రిటరీస్) కేడర్‌కు బదిలీ చేసింది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఆలిండియా సర్వీసెస్ అధికారులు పనిచేస్తుంటారు. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ గత కొన్నేళ్లుగా సెంట్రల్ సర్వీసెస్‌లో భాగంగా కేంద్ర పారా మిలటరీ బలగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూ వచ్చారు. ఎన్ఎస్జీ చీఫ్‌గా నియమితులయ్యే వరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో అదనపు డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహించారు.

ఎవరు ఈ నళిన్ ప్రభాత్?

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలి సమీపంలో ఉన్న తుంగ్రి గ్రామంలో 1968లో జన్మించిన నళిన్ ప్రభాత్, సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ ఎంఏ చేశారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎన్నికైన ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పనిచేశారు. కరీంనగర్, కడప, వరంగల్ జిల్లాల ఎస్పీగా పనిచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీగా నళిన్ ప్రభాత్ పనిచేసిన సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. వాటిని ఎదుర్కోవడంలో ఆయన చూపిన తెగువ, చొరవకు ప్రశంసలతో పాటుగా అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి. గ్యాలంట్రీ మెడల్స్, పరాక్రమ్ పతక్(విశిష్ట సేవా పతకం), ఆంత్రిక్ సురక్ష పతకం సహా అనేక మెడల్స్ అందుకున్నారు. 2004 నుంచి కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతూ వచ్చారు. మొదట కొన్నాళ్లు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(NDRF)లో పనిచేసిన ఆయన, ఆ తర్వాత ఇండో-టిబెటన్ పోలీస్ ఫోర్స్(ITBP) 14వ బెటాలియన్(శ్రీనగర్), 21వ బెటాలియన్(శ్రీనగర్), 16వ బెటాలియన్(లడఖ్)లకు కమాండెంట్‌గా పనిచేశారు. తర్వాత సీఆర్పీఎఫ్‌లో సౌత్ కాశ్మీర్ ఆపరేషన్ రేంజ్ డీఐజీగా మూడేళ్లపాటు పనిచేసిన ఆయన, కొన్నాళ్లు చండీగఢ్ రేంజ్, బస్తర్ ఆపరేషన్స్ రేంజ్‌లలో డీఐజీగా పనిచేశారు. 2010 డిసెంబర్ నుంచి రెండేళ్ల పాటు సీఆర్పీఎఫ్‌లో ఆపరేషన్స్, ఇంటెలిజెన్స్, ట్రైనింగ్, జమ్ము-కాశ్మీర్ జోన్, శ్రీనగర్ సెక్టార్లలో సేవలందించారు. ఐజీగా పదోన్నతి పొందిన తర్వాత కూడా కాశ్మీర్ ఆపరేషన్స్ సెక్టార్‌కు నేతృత్వం వహించారు.

ఇలా సుదీర్ఘకాలం జమ్ము-కాశ్మీర్ రాష్ట్రంలో వివిధ కేంద్ర పారామిలటరీ బలగాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయనకు ఈ ప్రాంతంపై సమగ్ర అవగాహన, పట్టు ఉంది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో ఇదే ప్రాంతంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం కూడా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఏరికోరి జమ్ము-కాశ్మీర్ డీజీపీగా నియమించింది. అక్టోబర్ 1 నుంచి ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. అప్పటి వరకు ఆయన స్పెషల్ డైరెక్టర్ జనరల్(Spl DG)గా వెంటనే బాధ్యతలు చేపట్టాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ప్రస్తుతం జమ్ము-కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నందున ఆ రాష్ట్రం పోలీస్ విభాగం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంది. ప్రస్తుతం జమ్ము-కాశ్మీర్ డీజీపీగా ఉన్న ఆర్.ఆర్. స్వైన్ పదవీకాలం సెప్టెంబర్ నెలాఖరుతో ముగియనుంది. సాధారణంగా పదవీకాలం ముగిసిన తర్వాత మరొక సీనియర్ అధికారికి పోస్టింగ్ ఇచ్చి బాధ్యతలు అప్పగించేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య వివిధ విభాగాల అధిపతులు పదవీ విరమణ చేయడానికి 2 నెలల ముందే మరొకరిని స్పెషల్ డీజీ, ఓఎస్డీ వంటి హోదాలతో నియమిస్తోంది. తద్వారా ఆ విభాగంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోడానికి తగిన సమయం కొత్త అధికారికి దొరుకుతోంది. విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టడంతోనే రంగంలోకి దిగి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం కల్గుతోంది. ఇప్పుడు వామపక్ష తీవ్రవాదులతో పాటు సీమాంతర ఉగ్రవాదులతో పోరాటంలో సుదీర్ఘ అనుభవం కల్గిన నళిన్ ప్రభాత్ నియామకంతో జమ్ము-కాశ్మీర్ పోలీస్ విభాగం మరింత శక్తివంతంగా మారనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి