తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. తిరుపూర్ జిల్లాలో బాణాసంచా తయారు చేస్తున్న ఓ ఇంట్లో పేలుడు జరగడం ముగ్గురు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. బాణాసంచా గోదాం ఇళ్ల మధ్యలో ఉండడంతో పేలుడు ధాటికి పది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పేలుడు శబ్దానికి ప్రజలు పరుగులు తీశారు. ఇళ్ల మధ్య బాణాసంచా తయారీ కేంద్రం ఏర్పాటు చేయడంతో నిర్వాహకులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల మధ్యలో క్రాకర్స్ తయారీపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.
అటు.. పేలుడుకు సంబంధించిన దృశ్యాలు పక్కనున్న ఓ కుట్టు మిషన్ల పరిశ్రమలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పేలుడు జరగడంతో కుట్టు మిషన్ల సామాగ్రి ఒక్కసారిగా కిందపడిపోగా.. అందులో పనిచేస్తున్న సిబ్బంది ఉలిక్కి పడ్డారు. ఇక.. ఇళ్ల మధ్య అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదిలావుంటే.. త్వరలో దీపావళి పండుగ రానుండడంతో క్రాకర్స్‌కు ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని పలు ప్రాంతాల్లో బాణాసంచా తయారీలో స్పీడ్ పెంచారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే.. క్రాకర్స్ తయారీ పరిశ్రమల్లో ప్రమాదవశాత్తు వరుసగా పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం తమిళనాడులోని విరుదానగర్ జిల్లా చత్తూర్ దగ్గర కూడా బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగ కమ్ముకుంది. పేలుడు ధాటికి చుట్టు పక్కల పొలాల్లో పనిచేస్తున్న జనాలు పరుగులు తీయగా.. సుమారు 15కు పైగా షెడ్లు ధ్వంసమయ్యాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..