Karnataka Jobs Reservation: ‘ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు కావాలంటే నైపుణ్యమే ప్రధానం’.. కర్నాటకలో రిజర్వేషన్ల రచ్చ..

|

Jul 17, 2024 | 2:03 PM

కర్నాటకలో కొత్త రచ్చ రాజుకుంది. రిజర్వేషన్ల వ్యవహారం అగ్గి రాజేసింది. ప్రైవేట్‌ సంస్థల్లో కిందిస్థాయి ఉద్యోగాలను వందశాతం కన్నడిగులతోనే భర్తీ చేసేలా కర్నాటక ఒక బిల్లును రూపొందించింది. దీనికి నిన్న కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రేపు ఈ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెడతారు.

Karnataka Jobs Reservation: ‘ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు కావాలంటే నైపుణ్యమే ప్రధానం’.. కర్నాటకలో రిజర్వేషన్ల రచ్చ..
Karnataka Jobs Reservation Row
Follow us on

కర్నాటకలో కొత్త రచ్చ రాజుకుంది. రిజర్వేషన్ల వ్యవహారం అగ్గి రాజేసింది. ప్రైవేట్‌ సంస్థల్లో కిందిస్థాయి ఉద్యోగాలను వందశాతం కన్నడిగులతోనే భర్తీ చేసేలా కర్నాటక ఒక బిల్లును రూపొందించింది. దీనికి నిన్న కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రేపు ఈ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అయితే ఈ బిల్లుపై పరిశ్రమవర్గాలు మండిపడుతున్నాయి. ఈ బిల్లు ప్రకారం ప్రైవేట్‌ సంస్థల్లోని గ్రూప్‌-సి, గ్రూప్‌-డి… పోస్టులను కచ్చితంగా కన్నడిగులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా పరిశ్రమ లేదా కంపెనీలో మేనేజ్‌మెంట్‌ కేటగిరిలో 50శాతం మందిని, నాన్‌మేనేజ్‌మెంట్‌ కేటగిరీలో 70శాతం మందిని.. కేవలం స్థానికులనే నియమించుకోవాల్సి ఉంటుంది. కర్నాటకలోని ఏ ప్రైవేట్‌ సంస్థకైనా ఈ రూల్‌ను తప్పనిసరి చేయబోతోంది ప్రభుత్వం.

కర్నాటకలో ఉద్యోగాల కోసం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పని లేదని IT రంగ నిపుణుడు మోహన్‌దాస్‌ పాయ్‌ చెబుతున్నారు. అసలు తమ రాష్ట్రంలో ఉద్యోగాల కొరత లేదనీ, అటువంటప్పుడు వందశాతం రిజర్వేషన్లు ఎందుకని ఆయన నిలదీస్తున్నారు. అసలు కర్నాటకలో ఏం జరుగుతోందని ఆయన నిలదీస్తున్నారు.

కర్నాటక ప్రభుత్వ తీరును బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా కూడా తప్పుబట్టారు. ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు కావాలంటే నైపుణ్యమే ప్రధానమన్నారు. టెక్నాలజీలో మనం అగ్రగామిగా ఉన్నామనీ, ఇలాంటి చర్యల ద్వారా మన స్థాయిని తగ్గించుకోకూడదని కిరణ్‌ మజుందార్‌ షా ట్వీట్‌ చేశారు.

అయితే, పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతను కర్నాటక మంత్రి ప్రియాంక్‌ ఖర్గే కొట్టిపారేశారు. ఇందులో భయపడాల్సింది ఏమీ లేదని చెప్పారాయన. ఉద్యోగాలు కావాలంటే పెట్టుబడులు రావాలని ఆయన కౌంటర్‌ ఇచ్చారు. కన్నడ యువతలో నైపుణ్యానికి కొదువలేదనీ, అదేసమయంలో మనవాళ్లకు ఉద్యోగాలు రావడం కూడా ముఖ్యమేనని ప్రియాంక్‌ ఖర్గే చెప్పారు.

మొత్తమ్మీద వందశాతం రిజర్వేషన్ల వ్యవహారం కాక రేపుతోంది. దీనిపై పరిశ్రమ వర్గాలు తీవ్రంగా రియాక్ట్‌ కావడం ఆసక్తిని రేపుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..