Indian Railways: భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే రైల్వే వ్యవస్థనే. ప్రతినిధ్యం లక్షలాది మంది తమ తమ రైలు ప్రయాణం ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఇతర రవాణా వ్యవస్థలకంటే రైళ్లలో తక్కువ ఛార్జీలు ఉంటాయి. అందుకే సామాన్యులు కూడా అధికంగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కూడా ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక వసతులు కల్పిస్తుంటుంది. మెరుగైన సేవలు అందించే విధంగా రైల్వే స్టేషన్‌లలో, రైలు బోగిల్లో అన్ని వసతులు కల్పిస్తోంది రైల్వే శాఖ.
ఇటీవల పర్యాటకులను ఆకట్టకునే విధంగా పాపులర్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టింది. ఈ కాన్సెప్ట్ ఇటీవల పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రైలు బోగీనే రెస్టారెంట్‌గా మార్చడమే ఈ కాన్సెప్ట్ ప్రత్యేకత. ఇటీవల ఇలాంటి రెస్టారెంట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది భారతీయ రైల్వే వ్యవస్థ. రైల్వే స్టేషన్లను సుందరీకరించడంతో పాటు పర్యాటకులను ఆకట్టుకునేలా ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
తాజాగా ముంబైలో రెస్టారెంట్ ఆన్ వీల్స్ ప్రారంభించింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఆవరణలో ఈ రెస్టారెంట్‌ను సెంట్రల్ రైల్వే ప్రారంభించింది. ఈ రెస్టారెంట్ పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటోంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్‌లో హెరిటేజ్ గల్లీలో ప్లాట్‌ఫామ్ నెంబర్ 18 కి ఎదురుగా రెస్టారెంట్ ఆన్ వీల్స్‌ను చూడవచ్చు. హెరిటేజ్ గల్లీలో నారోగేజ్ లోకోమోటీవ్స్, పాత ప్రింటింగ్ ప్రెస్ పార్ట్స్ లాంటి వారసత్వ సంపదను చూసే విధంగా ఏర్పాటు చేశారు. అక్కడే రెస్టారెంట్ ఆన్ వీల్స్ ప్రారంభించడం విశేషం.
ఉపయోగంలో లేని బోగీలతో రెస్టారెంట్:
కాగా, ఉపయోగంలో లేని రైలు బోగీలను తీసుకుని రెస్టారెంట్‌గా మార్చడం విశేషమనే చెప్పాలి. ఇందులో 10 టేబుల్స్ ఉన్నాయి. 40 మంది వరకు కూర్చోవచ్చు. బోగీ లోపల ఇంటీరియర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. కళ్లు చెదిరే లైటింగ్, ఫ్యాన్లు, ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్ ప్రత్యేకతను తెలిపే పెయింటింగ్స్ చూడవచ్చు.
ఈ రైల్వే శాఖకు అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఈ కాన్సెప్ట్‌ని ఎంతగానో ఉపయోగపడనుంది. రెస్టారెంట్ ఆన్‌వీల్స్ ద్వారా ఏటా రూ.50 లక్షల వరకు ఆదాయం వస్తుందని అంచనా. భారతీయ రైల్వే రైలు బోగీని రెస్టారెంట్‌గా మార్చి ఇతర సంస్థలకు ఐదేళ్ల కాలపరిమితితో కాంట్రాక్ట్ ఇస్తోంది. ఆ రెస్టారెంట్లను ఇతర సంస్థలు నిర్వహిస్తాయి. కానీ ఆ రెస్టారెంట్ మాత్రం భారతీయ రైల్వే ఆధీనంలోనే ఉంటుంది. అయితే ఇలాంటి రెస్టారెంట్లు పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌లో, మధ్యప్రదేశ్‌లోని భోపాల్ డివిజన్‌లో, జబల్‌పూర్‌లో కూడా ఉండగా, తాజాగా ముంబైలో కూడా ఈ రెస్టారెంట్ ప్రారంభమైంది. త్వరలో మరిన్ని రైల్వే స్టేషన్ల ఆవరణలో రెస్టారెంట్ ఆన్‌వీల్స్ ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.