జమ్ముకశ్మీర్‌లో నిర్మిస్తున్న మొదటి కేబుల్ ఆధారిత రైల్వే వంతెన ప్రారంభానికి సిద్ధమవుతోంది. కేబుల్ స్టెడ్ వంతెనపై ట్రయల్ రన్ పూర్తి చేసి.. భారత రైల్వే అరుదైన ఘనత సాధించింది. అంతేకాదు.. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సరికొత్త బ్రిడ్జిలను నిర్మిస్తూ దూసుకుపోతుంది.
దేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జి. అంజి ఖాడ్ వంతెనపై భారత రైల్వే సంస్థ తొలి ఎలక్ట్రిక్ టవర్ వ్యాగన్‌తో ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ బ్రిడ్జి కశ్మీర్ లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానిస్తుంది. ట్రయల్ రన్ పూర్తి కావడంతో వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రాజెక్ట్ పురోగతిని పేర్కొంటూ ఎక్స్‌లో ట్రయల్ రన్ వీడియోను షేర్ చేశారు.
1st electric engine rolling through Tunnel No. 1 and the Anji Khad Cable Bridge.
📍J&K pic.twitter.com/YOjkeJmDva
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 25, 2024
ఈ మధ్యే పూర్తయిన అంజి ఖడ్ వంతెన.. నదీ గర్భం నుంచి 331 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఒకే పైలాన్‌ను కలిగిన ఇంజనీరింగ్ అద్భుతంగా రూపొందింది. మొత్తం 48 కేబుల్స్ సపోర్ట్‌తో ఈ వంతెన నిర్మించారు. పొడవు 473.25 మీటర్లు.. వయాడక్ట్ 120 మీటర్లు.. సెంట్రల్ కరకట్ట 94.25 మీటర్లలో విస్తరించి ఉంది. ఇది చీనాబ్ వంతెన తర్వాత భారత దేశంలో రెండో ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు తెచ్చుకుంది. యూఎస్‌బీఆర్‌ఎల్ ప్రాజెక్ట్ మొత్తం 272 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇందులో 255 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తయ్యాయి. కత్రా-రియాసి మధ్య మిగిలి ఉన్న నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే పనుల్లో ఉన్నారు అధికారులు. ఉధంపూర్ – శ్రీనగర్ – బారాముల్లా రైలు లింక్ భారత ఉప ఖండంలో అత్యంత సవాల్‌గా ఉన్న రైల్వే ప్రాజెక్ట్‌ల్లో ఒకటి. ఈ ప్రాజెక్ట్ శ్రీనగర్ – జమ్మూ మధ్య ప్రయాణ సమయాన్ని 6 గంటల నుంచి 3.5 గంటలకు తగ్గిస్తుంది. జనవరి 2025లో కశ్మీర్ – ఢిల్లీ మధ్య ప్రయాణించే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అదే రోజు యూఎస్‌బీఆర్‌ఎల్‌ను జాతికి అంకితం చేయనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..