న్యూజీలాండ్ ఎంపీగా భారత సంతతి వ్యక్తి.. సంస్కృతంలో ప్రమాణ స్వీకారం..

|

Nov 25, 2020 | 6:21 PM

మన దేశ మూలాలు కలిగిన ఎందరో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల చట్టసభల్లో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన డాక్టర్ గౌరవ్ శర్మ పశ్చిమ హామిల్టన్ నుంచి న్యూజిలాండ్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

న్యూజీలాండ్ ఎంపీగా భారత సంతతి వ్యక్తి.. సంస్కృతంలో ప్రమాణ స్వీకారం..
Follow us on

మన దేశ మూలాలు కలిగిన ఎందరో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల చట్టసభల్లో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన డాక్టర్ గౌరవ్ శర్మ పశ్చిమ హామిల్టన్ నుంచి న్యూజిలాండ్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతేనా.. ఆయన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. న్యూజీలాండ్ పార్లమెంట్‌లో ఎంపీగా సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసి గౌరవ్ శర్మ సరికొత్త రికార్డును నెలకొల్పారు. న్యూజీలాండ్ చట్ట సభ చరిత్రలో సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. కాగా, విదేశీ చట్ట సభల్లో సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన రెండవ వ్యక్తిగా గౌరవ్ నిలిచారు. తొలుత ఆ దేశానికి సంబంధించిన మావొరి భాషలో ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ్ శర్మ.. ఆ తరువాత సంస్కృతంలో తన ప్రమాణ స్వీకారాన్ని కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 33 ఏళ్ల గౌరవ్ శర్మ కుటుంబం న్యూజీలాండ్‌లో స్థిరపడింది. న్యూజీలాండ్‌లోని పశ్చిమ హామిల్టన్ పార్లమెంట్ స్థానంలో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిపై 4,386 ఓట్లతో గెలుపొందారు.