Farm Laws – New Crop Varieties: కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. సాగు చట్టాలను రద్దు చేసి.. పంటలకు గిట్టుబాటు ధరలు ప్రకటించాలన్న డిమాండ్‌తో ఏడాదిగా పలు రకాలుగా ఆందోళనలు చేపడుతున్నారు. భారత్ బంద్, నిరసనలు, ఆందోళనలు, దీంతోపాటు జనవరి 26న ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు సైతం జరిగాయి. ఈ రైతుల ఆందోళనల కారణంగా గతేడాదిగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే.. కేంద్ర తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు జరిగే నష్టం ఏంటీ..? సాగు చట్టాలు ఎంతవరకు ప్రమాదం..? అన్న విషయాలపై రైతు సంఘాలు, కానీ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కానీ ఎలాంటి రుజువును ఇప్పటివరకు సమర్పించలేదు. పైగా కొత్త చట్టాలతో కేంద్రం ఎంఎస్‌పీ (కనీస గిట్టుబాటు ధర) తొలగిస్తుందన్న ఆరోపణలపై కూడా క్లారిటీ ఇవ్వలేకపోయారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతులు పండిస్తున్న పంటలకు కనీస మద్దతు ధరను పెంచడం మనకు తెలిసిందే.
ఏడాదిగా కొనసాగుతున్న రైతుల నిరసనల మధ్య దేశంలోని పలు మండీల ద్వారా ఇప్పటివరకు రూ. 85000 కోట్ల కొనుగోళ్లు జరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల పంటలకు గిట్టుబాటు ధరతోపాటు పంటల కొనుగోళ్లపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపెట్టదని అధికార వర్గాలు పక్కా ఆధారాలు చూపెడుతున్నాయి. దీంతో నిరసనకారులు ఆరోపిస్తున్నట్లు.. కొత్త వ్యవసాయ చట్టాల కారణంగా మండీలు మూతబడే అవకాశం నెలకొంటుందన్న ఆరోపణల్లో పస లేదని తేలిపోయింది. ఇక్కడో ఆసక్తికర విషయం ఎంటంటే.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎక్కువగా ఉద్యమిస్తున్న పంజాబ్, హర్యానాలోని మండీల ద్వారా అత్యధిక వరి సేకరణ జరిగింది. ఆ రాష్ట్రాల్లో ఏకంగా 75 శాతం కంటే ఎక్కువ వరి సేకరణ జరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉద్యమం మొదట్లో నిరసనకారుల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో 18 నెలల పాటు కొత్త చట్టాల అమలును నిలిపివేయడానికి మోదీ సర్కార్ అంగీకరించింది. అయినప్పటికీ రైతు సంఘాల నాయకులు మొండిగా వ్యవహరిస్తూ.. తమ ఆందోళనలను కొనసాగించేందుకే మొగ్గుచూపారు. రాజకీయ ప్రేరేపిత కారణాలతో రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళనలను కొనసాగిస్తూ వస్తున్నారు.
ప్రధాని మోదీ కీలక నిర్ణయం..
ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం రైతు సంఘాల ప్రతినిధులను ఇరకాటంలో పడేసింది. తాజాగా ప్రధాని మోదీ 35 కొత్త పంట రకాలను (వంగడాలు) జాతికి అంకితం చేశారు. కొత్త వంగడాలు ప్రధానంగా కరువు ప్రభావిత ప్రాంతాలకు లబ్ధి చేరనుంది. ఓ రకంగా సన్నకారు రైతుల పాలిట ఇదో వరం కానుంది. ఈ వంగడాల్లో కాలానుగుణ పంటలైన సోయాబీన్, గోధుమ, వరి, సోయాబీన్, ఆవాలు, మొక్కజొన్న, జోవార్, బజ్రా వంటి 35 కొత్త పంట రకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు మెరుగైన విత్తనాలను అందించిందని చెప్పారు. సాయిల్ హెల్త్ కార్డు, ఎరువుల లభ్యత, ఎంఎస్‌పీ ధర, తదితర విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) ప్రత్యేక లక్షణాలతో కూడిన పంట రకాలను అభివృద్ధి చేసిందని, వీటితో రైతులకు నేరుగా మేలు జరుగుతుందని తెలిపారు.
ప్రస్తుత ఆందోళనల మధ్య.. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం నిజంగా దేశ రైతులకు శుభవార్తేనని వ్యవసాయ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కొత్త వంగడాలతో రైతుల అభివృద్ధి సాధ్యమని.. ఉత్పత్తి కూడా పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రారంభమైన ఉద్యమం నాటి నుంచి.. రైతులకు నష్టం వాటిల్లిన సందర్భాలు లేవు. నిరసనకారులు ఆరోపించినట్లు మండీలు మూసివేయలేదు. చిన్న రైతుల భూమిని ఎవరూ ఆక్రమించలేదు. రైతులకు ఎంఎస్‌పీ ధర లభిస్తూనే ఉంది. గతేడాది ప్రారంభమైన ఉద్యమం నాటినుంచి పంటకు గిట్టుబాటు ధర పెరుగుతూనే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది కంటే గోధుమలకు గిట్టుబాటు ధర క్వింటాలకు రూ.40 పెరిగింది. వరికి రూ.72, శనగలకు రూ.130, బార్లీ రూ.35, మసూర్ పప్పు రూ.400, పొద్దుతిరుగుడు రూ.114, ఆవాలు రూ.400 మేర పెరిగాయి. దీంతోపాటు నువ్వు, పత్తి, ఇతర తృణ ధాన్యాలకు, చెరకు లాంటి పంటకు కూడా ఎంఎస్‌పీ ధర పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. రైతు సంఘాల ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం మరోసారి కొత్త వ్యవసాయ చట్టాలతో ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టంచేసిందని.. వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు.
Pawan kalyan Live Video: మంగళగిరికి జనసేనాని… మంగళగిరిలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ.. లైవ్ వీడియో..