Indian Economy: వేగంగా వృద్ధి చెందుతున్న భారతీయ ఆర్థిక వ్యవస్థ.. వృద్ధి రేటును ప్రకటించిన ఐఎంఎఫ్‌

ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతీయ ఆర్థిక వ్యవస్థ ఒకటని.. ఐఎంఎఫ్ పేర్కింది. భారతదేశం, చైనా కీలకమైన ఆర్థిక ఇంజిన్‌లుగా పనిచేస్తాయని, వినియోగం, పెట్టుబడి, వాణిజ్యం ద్వారా ప్రపంచ వృద్ధిని నడిపించగలవని IMF తెలిపింది.

Indian Economy: వేగంగా వృద్ధి చెందుతున్న భారతీయ ఆర్థిక వ్యవస్థ.. వృద్ధి రేటును ప్రకటించిన ఐఎంఎఫ్‌
Imf

Updated on: Apr 12, 2023 | 10:01 AM

కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వృద్ధి రేటు అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2023-24) గాను భారతదేశ జీడీపీ అంచనాను ఐఎంఎఫ్‌ తగ్గిస్తూ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో భారత వృద్థి రేటు 5.9 శాతానికే పరిమితం కావొచ్చని ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ పేర్కొంది. 2022-23లో 6.8 శాతంగా ఉండొచ్చని అంచనా వేసిన ఐఎంఫ్.. తాజాగా.. భారీ తగ్గుదలను చూపించింది. 2023-24లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.9 శాతంగా ఉండొచ్చని తెలిపింది. 2023లో ప్రపంచ వృద్థి రేటు 2.78 శాతానికి తగ్గొచ్చని.. వచ్చే ఏడాది 3 శాతంగా ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ విశ్లేషించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతీయ ఆర్థిక వ్యవస్థ ఒకటని.. ఐఎంఎఫ్ పేర్కింది. భారతదేశం, చైనా కీలకమైన ఆర్థిక ఇంజిన్‌లుగా పనిచేస్తాయని, వినియోగం, పెట్టుబడి, వాణిజ్యం ద్వారా ప్రపంచ వృద్ధిని నడిపించగలవని IMF తెలిపింది.

2023-24లో భారత వృద్థి రేటు 6.3 శాతంగా ఉండొచ్చని ఇటీవల ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే, 6.4 శాతం నమోదు కావొచ్చని ఆర్బీఐ పేర్కొనగా.. 6 శాతమే ఉండొచ్చని ఎస్‌అండ్‌పి గ్లోబల్‌ రేటింగ్‌ సంస్థ తెలిపింది. ఈ తరుణంలో వాటి అంచనాలను తగ్గిస్తూ ఐఎంఎఫ్ ప్రకటన చేసింది. ఇంతకుముందు భారత వృద్ధి రేటు 6.1 శాతంగా ఉంది. తమ తాజా వార్షిక ప్రపంచ ఎకనామిక్‌ ఔట్‌లుక్‌లో ఈ గణాంకాలను ప్రచురించింది. ఇదిలాఉంటే.. చైనా వృద్ధిరేటు ఈ ఏడాది 5.2 శాతంగా, వచ్చే ఏడాది 4.5 శాతంగా నమోదు కావచ్చని ఐఎంఎఫ్‌ పేర్కొంది. ద్రవ్యోల్బణం తగ్గే వీలున్నప్పటికీ.. జీడీపీ వృద్ధిరేటు మాత్రం మరింత మందగించవచ్చని ఐఎంఎఫ్‌ పేర్కొంది.

‘‘భారత ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరును కొనసాగిస్తోంది.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆసియా ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో ఒకటి” అని IMF ఆసియా, పసిఫిక్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ అన్నే-మేరీ గుల్డే-వోల్ఫ్ PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..