అంతరిక్షంలోకి వెళ్లేముందు తనకిష్టమైన పాట విన్న శుభాంశు శుక్లా! ఆ పాట ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

యాక్సియన్-4 మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి ప్రయాణించే ముందు 'ఫైటర్' సినిమాలోని 'వందేమాతరం' పాట విన్నారు. నాసాలో ఇది సాధారణ ఆచారం, ఒత్తిడిని తగ్గించుకోవడానికి. ఈ దేశభక్తి పాట శుభాంశుకు చాలా ఇష్టం. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించిన యాక్సియన్-4, ఐఎస్ఎస్ తో అనుసంధానం అవుతుంది.

అంతరిక్షంలోకి వెళ్లేముందు తనకిష్టమైన పాట విన్న శుభాంశు శుక్లా! ఆ పాట ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Astronauts

Updated on: Jun 25, 2025 | 1:03 PM

నలుగురు వ్యోమగాములతో యాక్సియం-4 ఈ రోజు(బుధవారం) మధ్యాహ్నం 12.01 గంటలకు నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఇందులో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా కూడా ఉన్నారు. అయితే.. శుభాంశు శుక్లా వ్యోమనౌకలోకి వెళ్లడానికి ముందు తనకు ఎంతో ఇష్టమైన ఓ పాటను విన్నారు. గతేడాది విడుదలైన ‘ఫైటర్‌’ అనే బాలీవుడ్‌ సినిమాలోని ‘వందేమాతరం’ అనే పాటను శుక్లా విన్నారు. ఈ పాట అంటే ఆయన చాలా ఇష్టమట. అందుకే అంతరిక్షంలోకి వెళ్లేముందు ఆయన పాట విన్నారు. ‘‘విజయం అనేది ప్రతి భారతీయుడి నరనరాల్లో ఉంటుంది. మన పరాక్రమానికి శత్రువు కూడా సెల్యూట్‌ చేస్తాడు’’ అంటూ సాగే ఈ పాట దేశభక్తిని రగిలిస్తుంది. ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ రూపొందించిన ‘ఫైటర్‌’ సినిమాలో బాలీవుడ్‌ నటీనటులు హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొణె, అనిల్‌కపూర్‌ తదితరులు నటించారు. బంకింగ్‌ చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరాన్ని రీమిక్స్‌ చేసి రూపొందించిన ‘వందేమాతరం’ పాటను విశాల్ దడ్లానీ పాడారు.

పాట ఎందుకు విన్నారు..?

సాధారణంగా వ్యోమగాములు అంతరిక్షయానం చేపట్టే ముందు వారికి ఇష్టమైన సంగీతం వినడం నాసాలో ఒక ఆనవాయితీగా ఉంది. ఎలాంటి కంగారుపడకుండా మిషన్‌పై దృష్టిపెట్టేందుకు ఇలా ఇష్టమైన పాటలు వింటారు. ఒత్తిడిని తగ్గించేందుకు సంగీతం శక్తిమంతమైన సాధనం అని పలు అధ్యయనాల్లోనూ తేలిన విషయం తెలిసిందే. అందుకే శుభాంశు శుక్లా కూడా తొలిసారి అంతరిక్షయానం చేయబోయే ముందు తనకు ఎంతో ఇష్టమైన వందేమాతరం పాటను మనస్ఫూర్తిగా విన్నారు.

ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఫాల్కన్‌ 9 రాకెట్‌ను ప్రయోగించారు. దీనికి శుభాంశు మిషన్‌ పైలట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యోమనౌక గురువారం సాయంత్రం 4:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)తో అనుసంధానం అవుతుంది. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదాపడుతూ వస్తోంది. ఐఎస్‌ఎస్‌లో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి