
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం రక్తపాతానికి నేటితో సరిగ్గా ఏడాది. గత ఏడాది ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన ఘాతుకంలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద జ్ఞాపకాలు నేటికీ పహల్గాం వీధుల్లో తడి ఆరని గాయాలుగానే మిగిలిపోయాయి. ఆ దాడి తర్వాత సుమారు 45 పర్యాటక కేంద్రాలను ప్రభుత్వం మూసివేయాల్సి వచ్చింది.
నేడు (ఏప్రిల్ 22) పహల్గాం స్మారక చిహ్నం వద్ద బాధిత కుటుంబాలు నివాళులర్పించాయి. మరోవైపు, ఉగ్రవాదులు మళ్ళీ దాడులకు తెగబడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో లోయలో హైఅలర్ట్ ప్రకటించారు. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అణువణువూ గాలిస్తూ, సానుభూతిపరుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. దాల్ లేక్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భయం నీడలు ఉన్నప్పటికీ, వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం పర్యాటకులు దాల్ లేక్ వద్దకు చేరుకుంటున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది పూర్తైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధితులను స్మరించుకుంటూ, వారిని ఎన్నటికీ మరచిపోలేమని అన్నారు. భారతదేశం ఏ రూపంలోనైనా ఉగ్రవాదానికి ఎప్పటికీ తలవంచదని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదుల దుష్ట పన్నాగాలు ఎప్పటికీ సఫలం కావు. ఈ విషాద సమయంలో బాధితుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రధాని మోదీ సోషల్ మీడియా x వేదికగా కీలక పోస్ట్ చేశారు. “గత సంవత్సరం ఇదే రోజున పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలను గుర్తు చేసుకుంటున్నాను. వారిని ఎప్పటికీ మరచిపోలేము. ఈ దుఃఖ సమయంలో బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఒక దేశంగా, మనం దుఃఖంలోనూ, సంకల్పంలోనూ ఐక్యంగా ఉన్నాము. భారతదేశం ఏ రూపంలోనైనా ఉగ్రవాదానికి ఎప్పటికీ తలవంచదు. ఉగ్రవాదుల దుష్ట పన్నాగాలు ఎప్పటికీ సఫలం కావు.” అంటూ ప్రధాని మోదీ హెచ్చరించారు.
Remembering the innocent lives lost in the gruesome Pahalgam terror attack on this day last year. They will never be forgotten. My thoughts are also with the bereaved families as they cope with this loss.
As a nation, we stand united in grief and resolve. India will never bow to…
— Narendra Modi (@narendramodi) April 22, 2026
ఇదిలావుంటే ఉగ్రవాదుల దాడిలో 26 మంది మరణించారు. అయితే మరణించిన వారి పేర్లతో బైసరణ్ లోయ సమీపంలో స్మారక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. దానిపై మరణించిన 26 మంది పర్యాటకుల పేర్లు, వారు ఏ రాష్ట్రం నుండి వచ్చారు అనే వివరాలను పొందుపరిచారు. ఈ ప్రాంతానికి వచ్చిన పర్యాటకులు, స్థానికులు నివాళులు అర్పిస్తున్నారు. ఏడాది క్రితం పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి చేదు జ్ఞాపకాన్ని తుడిచివేస్తూ.. శాంతి, భద్రతలే లక్ష్యంగా అధికారులు ముందడుగు వేస్తున్నారు. దీంతో అక్కడ మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దేశం నలుమూలల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.
మరోవైపు పర్యాటకులలో ధైర్యాన్ని నింపేందుకు అధికారులు వినూత్నంగా QR కోడ్ ఆధారిత స్కానింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ డిజిటల్ విధానం ద్వారా పర్యాటకులు, స్థానిక వ్యాపారుల వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. ఈ పటిష్ట భద్రతా చర్యల పట్ల పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటన ఆధారంగా ఈ ప్రాంతాన్ని అంచనా వేయలేమని, ప్రస్తుతం ఇక్కడ చాలా సురక్షితంగా ఉందని పర్యాటకులు తెలిపారు. స్థానిక ప్రజల ఆదరణ బాగుందని, భయం లేకుండా ఇక్కడ పర్యటించవచ్చని చెబుతున్నారు. మరికొందరు పర్యాటకులు కూడా నగరం ప్రశాంతంగా ఉందని చెబుతూ, భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కల్పిస్తున్న భద్రతపై తమకు పూర్తి విశ్వాసం ఉందని వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..