AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరిహద్దు అవతలున్నా వదిలేది లేదు.. హఫీజ్ సయీద్‌పై భారత్ సరికొత్త అస్త్రం

పాక్‌లో దాక్కుని భారత భూభాగంపై ఉగ్రదాడులకు కుట్రలు పన్నుతున్న మాస్టర్‌మైండ్స్‌కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ప్రధాన కుట్రదారుడైన హఫీజ్ సయీద్‌పై జమ్మూలోని ప్రత్యేక ఎన్‌ఐఏకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా.. కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా లాహోర్‌కు అధికారిక సమన్లు పంపే ప్రక్రియ ప్రారంభమైంది.

సరిహద్దు అవతలున్నా వదిలేది లేదు.. హఫీజ్ సయీద్‌పై భారత్ సరికొత్త అస్త్రం
Let Chief Hafiz Saeed Pahalgam Case
Krishna S
|

Updated on: Aug 22, 2026 | 3:51 PM

Share

లష్కరే తొయిబా చీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ చుట్టూ భారత్ ఉచ్చు బిగిస్తుంది. 2025 పహల్గామ్ ఉగ్రదాడి కేసుకు సంబంధించి లాహోర్‌లో ఉన్న హఫీజ్ సయీద్‌కు దౌత్య మార్గాల ద్వారా కోర్టు సమన్లు జారీ చేసేందుకు భారత్ రంగం సిద్ధం చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టిన దర్యాప్తులో భాగంగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా ఈ సమన్లను పాకిస్తాన్‌కు చేరవేయనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్‌ఐఏ దాఖలు చేసిన అనుబంధ చార్జ్‌షీట్‌లో హఫీజ్ సయీద్‌ను ప్రధాన సూత్రధారిగా పేర్కొంది. లష్కరే తొయిబా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థల కీలక నేతగా వ్యవహరిస్తూ భారత్‌పై యుద్ధం ప్రకటించడం, కుట్ర పన్నడం వంటి తీవ్రమైన అభియోగాలు మోపింది. జమ్మూలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు ఇప్పటికే సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.కేంద్ర హోం శాఖ, విదేశాంగ శాఖల సమన్వయంతో ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ద్వారా పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఈ సమన్లను అధికారికంగా పంపే ప్రక్రియను భారత ప్రభుత్వం ప్రారంభించింది.

కొత్త చట్టాల అస్త్రం

హఫీజ్ సయీద్‌కు సమన్లు జారీ చేయడం వెనుక భారత్ పక్కా న్యాయపరమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. కొత్త క్రిమినల్ చట్టం బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 356 ప్రకారం.. ఒక నిందితుడు దేశంలో లేనప్పటికీ లేదా కోర్టుకు హాజరుకాకపోయినా న్యాయ విచారణను కొనసాగించి తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఒకవేళ సయీద్ భారత్‌కు రాకపోయినా అతనికి కోర్టుకు హాజరయ్యే అవకాశం కల్పించామనే అధికారిక రికార్డును సృష్టించడం ఈ సమన్ల ముఖ్య ఉద్దేశం. దీని ఆధారంగా అతడిని అధికారికంగా చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్న నేరస్థుడిగా ప్రకటించి.. న్యాయ విచారణ పూర్తి చేయడానికి మార్గం సుగమమవుతుంది.

పాకిస్తాన్‌పై అంతర్జాతీయ, ఎఫ్‌ఏటీఎఫ్ ఒత్తిడి

పాకిస్తాన్ నుంచి నేరస్థుల అప్పగింత లేదా సహకారం లేనప్పటికీ, సయీద్‌ను చట్టం ముందుకు తీసుకురావడానికి అందుబాటులో ఉన్న అన్ని దౌత్య, న్యాయ మార్గాలను ఉపయోగించామని భారత్ ప్రపంచ వేదికలపై నిరూపించవచ్చు. ఉగ్రవాద నిధుల కేసుల్లో సయీద్ జైలులో ఉన్నాడని పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ, పాక్ రక్షణ వ్యవస్థ అతనికి రక్షణ కల్పిస్తోందని భారత్ ఎప్పటినుంచో ఆరోపిస్తుంది. ఈ తాజా చట్టపరమైన ఆధారాలు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌పై ఒత్తిడిని మరింత పెంచడానికి దోహదపడతాయి. విదేశాల్లో దాక్కుని భారత భూభాగంపై ఉగ్రదాడులకు కుట్రలు పన్నుతున్న ఉగ్రవాద సూత్రధారులను కొత్త చట్టాల ద్వారా బోనులో నిలబెట్టేందుకు భారత ప్రభుత్వం వేస్తున్న వ్యూహాత్మక అడుగుగా నిపుణులు దీనిని భావిస్తున్నారు.

Follow Us