కాకి పగ.. 17 ఏళ్లైనా తగ్గేదేలే.. ఈ చిన్న పక్షి మెదడు మిస్టరీ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
కాకిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ కావు కావు అంటూ ఆహారం కోసం వచ్చే ఈ నల్లటి పక్షి వెనుక మనుషులను సైతం ఆశ్చర్యపరిచే మేధస్సు దాగుందని మీకు తెలుసా? ఒకసారి చూసిన మనిషి ముఖాన్ని దాదాపు 17 ఏళ్లపాటు గుర్తుపెట్టుకోవడం నుంచి శత్రువుల వివరాలను తర్వాతి తరాలకు చేరవేయడం వరకు కాకుల ప్రవర్తన శాస్త్రవేత్తలనే అవాక్కయ్యేలా చేస్తుంది.

మన ఇంటి పరిసరాల్లో రోజూ కనిపించే కాకులను చూసి సాధారణ పక్షులని తేలిగ్గా తీసిపారేస్తుంటాం. కానీ వాటి సాధారణ రూపం వెనుక అసాధారణమైన మేధస్సు దాగి ఉందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. కాకులు మనుషుల ముఖాలను స్పష్టంగా గుర్తించడమే కాకుండా వాటిని ఏళ్ల తరబడి గుర్తుపెట్టుకోగలవని పరిశోధకులు తేల్చారు. అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జాన్ మార్జ్లఫ్ టీమ్ కాకులపై విస్తృత పరిశోధనలు చేసింది. పరిశోధకులు అడవి కాకులను పట్టుకుని ట్యాగింగ్ చేశారు. ఈ సమయంలో వాళ్లు డేంజర్ ముసుగులు ధరించారు. వీటిని కాకులు ప్రమాదకరంగా గుర్తించాయి. కొన్నేళ్ల తర్వాత వేరే వ్యక్తులు అటువంటి ముసుగు ధరించి వెళ్లడంతో కాకులు గుంపులుగా చేరి అరవడం, దాడికి యత్నించడం చేశాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఆ ఘటనను ప్రత్యక్షంగా చూడని తర్వాతి తరం కాకులు కూడా అదే ముసుగుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీని ఆధారంగా కాకులు సమాచారాన్ని ఒకదానితో ఒకటి పంచుకోవడమే కాకుండా ప్రమాద సంకేతాలను తర్వాతి తరాలకు సైతం చేరవేస్తాయని తేలింది. కాకులకు ఒక ముఖాన్ని దాదాపు 17 సంవత్సరాల పాటు గుర్తుపెట్టుకునే జ్ఞాపకశక్తి ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మనుషుల ముఖాలను చూసినప్పుడు కాకుల మెదడులో క్షీరదాల మాదిరిగానే జ్ఞాపకశక్తి, భావోద్వేగాలకు సంబంధించిన న్యూరాన్లు చురుగ్గా పనిచేస్తాయి.
కాకుల గుంపును మర్డర్ అని ఎందుకు పిలుస్తారు?
ఇంగ్లీషులో కాకుల గుంపును మర్డర్ ఆఫ్ క్రోస్ అని పిలవడం వెనుక శాస్త్రీయ కారణం కంటే చారిత్రక, జానపద నేపథ్యమే ఎక్కువ. మధ్యయుగంలో అంటే సుమారు 1486 నాటి ది బుక్ ఆఫ్ సెయింట్ ఆల్బన్స్ ప్రకారం.. జంతువులు, పక్షుల సమూహాలకు ప్రత్యేక పేర్లు పెట్టే ఆచారం ఉండేది. పురాతన కాలంలో యుద్ధభూములు, శవాలు ఉన్న ప్రదేశాల్లో కాకులు గుమిగూడి ఆహారం వెతుక్కునేవి. దీంతో ప్రజలు వీటిని మరణానికి, అశుభానికి చిహ్నంగా భావించి మర్డర్ అనే పదాన్ని స్థిరీకరించారు.
అద్భుతమైన జీవన నైపుణ్యాలు
కాకులు కేవలం ముఖాలను గుర్తుపెట్టుకోవడమే కాకుండా ఆహారం కోసం చిన్న చిన్న పుల్లలను పనిముట్లుగా వాడటం, సమస్యలను పరిష్కరించడం, తమ గుంపులోని తోటి కాకి చనిపోతే అంతా కలిసి ఒకచోట చేరి సంతాపం తెలిపినట్లు ప్రవర్తించడం వంటి విలక్షణమైన లక్షణాలను కలిగి ఉన్నాయి. మనం వాటికి హాని చేయకుండా స్నేహపూర్వకంగా ఉంటే అవి మనల్ని గుర్తించి మిత్రులుగా చూస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
