
IMD Rainfall Data: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో జులై మాసంలో వర్షాలు దంచికొట్టాయి. చాలా రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువే నమోదయ్యింది. అయితే గత నెల (ఆగస్టు 2023)లో మాత్రం ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు దాదాపుగా ముఖం చాటేశాడు. అక్కడా ఇక్కడ అన్న తేడా లేకుండా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రైతులు వర్షాల కోసం కళ్లలో ఒత్తులేసుకుని చూసినా ఫలితం లేకపోయింది. దీంతో పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆగస్టు మాసంలో నమోదైనట్లు ఈ స్థాయిలో అతి తక్కువ వర్షపాతం గత వందేళ్లలో ముందెన్నడూ నమోదుకాలేదని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) తెలిపింది. ఐఎండీ శుక్రవారం (సెప్టెంబర్ 1న) విడుదల చేసిన గణాంకాల మేరకు ఈ ఏడాది ఆగస్టు మాసంలో దేశంలో కేవలం 162.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. గత 122 ఏళ్లలో నమోదైన అతి తక్కువ వర్షపాతం ఇదేనని ఐఎండీ వెల్లడించింది. 1901 సంవత్సరం తర్వాత దేశంలో ఇంత తక్కువ వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారిగా ఐఎండీ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.
గత నెల (ఆగస్టు 2023)లో 167.70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా.. సాధారణ వర్షపాతం కంటే ఇది 36 శాతం తక్కువ. 1901 నుంచి 2023 వరకు గడిచిన 122 ఏళ్లలో ఆగస్టు మాసంలో కురిసన వర్షపాతం గణాంకాలను పరిశీలిస్తే.. అత్యధికంగా 2021 ఆగస్టులో 194.30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత 1913లో 193.70 మి.మీ, 2009లో 193.50 మి.మీ, 1920లో 192.70 మి.మీ, 1965లో 192.30 మి.మీ, 2005లో 191.20 మి.మీ భారీ వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. గత నెల (ఆగస్టు) దేశంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడానికి తక్కువ వర్షపాతం కురవడం, బలహీనమైన రుతు పవనాలు ప్రధాన కారణాలని ఐఎండీ పేర్కొన్నది.
భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) పంచుకున్న దేశంలో వర్షపాతానికి సంబంధించిన వివరాలు..
All India Rainfall during 1-31 August 2023 and during past 123 years for month of Aug ( 161.7 mm) lowest since 1901. pic.twitter.com/MioEs1JBVo
— India Meteorological Department (@Indiametdept) September 1, 2023
సెప్టెంబర్ మాసంలో దేశ వ్యాప్తంగా వర్షాలు..
కాగా సెప్టెంబరు మాసంలో మాత్రం నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకుని దేశ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనావేస్తోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు నైరుతి రుతుపవనాల పునరుద్ధరణకు అనుకూలంగా ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు అంచనావేస్తున్నట్లు వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..